బీజేపీకి ఎందుకు ఓటేయాలి..? కంపెనీలు ప్రైవేటుకు కట్టబెట్టినందుకా.. ఉద్యోగాలు ఊడగొట్టినందుకా..?
కర్ణాటక రాష్ట్రం బీదర్ వెళ్లాను.. అక్కడ ఆడబిడ్డ పెళ్లయితే ఆ ప్రభుత్వం ఇచ్చేది సున్నా. ఇక్కడ లక్ష రూపాయలు ఇస్తున్నాం. అక్కడ రైతును కలిశా..
సిద్దిపేట జిల్లా చెర్యాల, జనగామ జిల్లా టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. నల్లగొండ – ఖమ్మం- వరంగల్ జిల్లా పట్టబద్రుల నియోజవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి పళ్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుందన్నారు మంత్రి హరీశ్‌రావు. 50 ఏళ్లు కాంగ్రెస్, 20 ఏళ్లు టీడీపీ పాలన సాగించాయి. కనీసం తాగు నీరు ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత చెర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూల్ మెట్టలో మంచి నీటి సమస్య ఉందా అని ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ వెళ్లాను.. అక్కడ ఆడబిడ్డ పెళ్లయితే ఆ ప్రభుత్వం ఇచ్చేది సున్నా. ఇక్కడ లక్ష రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. అక్కడ రైతును కలిశా.. ఎన్ని ఎకరాలు వేవావంటే ఐదు ఎకరాలు వేశా అన్నాడు. సాగు నీరు ఉందా.. అంటే.. కరెంటు రోజుకు పది సార్లు వచ్చి పోతుందని.. ఐదెకరాలకు నీరు పారాలంటే పది రోజులు పడుతుందని చెప్పాడు.
ఇవాళ ఉదయం సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. చెర్యాల మండలం ఆకునూరులో ఓ చేను మడి ఎండిపోయిందని పేపర్లో వ చ్చింది. వెంటనే విద్యుత్ డీఈని సస్పెండ్ చేయమని చెప్పారు. 24 గంటల్లో ట్రాన్స్ ఫార్మర్ పెట్టమని… ఒక్క మడి కూడా ఎండిపోవద్దని ఆదేశించారు. ఎక్కడో పేపర్లో వస్తే…సీఎం ఫోన్ చేసి వెంటనే సమస్య పరిష్కరించాలని నాకు ఫోన్ చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వం పని తీరు అని మంత్రి హరీశ్‌రావు వివరించారు.
కర్ణాటకలో చేలు ఎండిపోతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. రైతుకు పెట్టుబడి సాయం అందుతుందా అంటే కర్ణాటక రైతు ఆరు వేలు వచ్చిందని చెప్పారు. ఐదెకరాలకు ఆరువేలు వచ్చింది అతనికి. మన దగ్గర ఐదు ఎకరాలకు 56 వేలు వస్తాయి. అక్కడ ఆరు గంటల కరెంటు వస్తే… ఇక్కడ 24 గంటల కరెంటు. పెన్షన్ ఎంత వస్తుందని ఓ భర్త చనిపోయిన మహిళను అడిగితే రూ.500 అని చెప్పింది. మన దగ్గర రూ.2016 ఇస్తున్నాం. ఎంత తేడా ఉంది. తేడా ఏంటంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ టీఆర్‌ఎస్ ప్రభుత్వం. అది కర్ణాటక రాష్ట్రం. ఇది తెలంగాణ రాష్ట్రం అని అన్నారు హరీశ్‌రావు
ఇక్కడ బీజేపీవాళ్లు నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నేనే ఒక బస్సు పెట్టి కర్ణాటక తీసుకెళ్తా… మీరు మాట్లాడితే ఇక్కడ కాదు… చేతనయితే ఢిల్లీలో మాట్లాడాలి. ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతుంది బీజేపీ అయితే ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తోంది తెరాస ప్రభుత్వమని హరీశ్‌రావు దుయ్యబట్టారు. బీఎస్ఎన్ ఎల్, రైల్వే, ఎల్. ఐ. సీ. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగాలు ఊడగొడుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నారు. ఎందుకు ఓటు వెయ్యాలి..? ఉద్యోగాలు ఊడగొట్టి నందుకు ఓటు వేయాలా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
గ్యాస్ ధర, పెట్రోల్ డిజీల్ ధర పెంచిడానికి ఓటు వేయాలా… ఈఏడాదిలో గ్యాస్ ధర 200 రూపాయలు పెంచింది. పెట్రోల్ వంద రూపాయలు చేసింది. ఇందు కోసం ఓటు వేయాలా..? ఇప్పుడు ఎరువుల ధర పెంచుతారంట.. యాసంగికి ఎరువుల ధర పెరగనుంది. ఎరువుల సబ్సిడీని మొన్న బడ్జెట్ లో 2 లక్షల కోట్లను తగ్గించింది. ఇది రైతు నడ్డి విరిచే చర్య. ఎరువుల ధర పెంచేందుకు ఓటు వేయాలా..? బీజేపీ చేసిందేమి లేదు.. మనకు రావాల్సింది కూడా ఇవ్వడం లేదు. తెలంగాణ 14.2 శాతం వృద్ధి రేటుతో దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉంది. అప్పుల్లో అతి తక్కువ తీసుకున్న రాష్ట్రాం తెలంగాణ. తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉంది. రైతు బంధు పథకం దేశంలో ప్రారంభించింది తెలంగాణ కాదా. దీన్ని కాపీ కొట్టి దేశంలో ప్రారంభించ లేదా.. అని హరీశ్‌రావు బీజేపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
కళ్యాణ లక్ష్మీ పథకాన్ని కాపీ కొట్టి మొన్న బడ్జెట్ లో గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో పథకం పెట్టారు. దానికి మోడల్ తెలంగాణ. మిషన్ భగీరథ పథకం, రెసెడెన్షియల్ స్కూల్స్ దేశానికి ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణ దేశానికి రోల్ మోడల్, ఓ బెంచ్ మార్కు. ఇది కేంద్ర మంత్రులు చెబుతున్నారు. ఢిల్లీలోని కేంద్ర బీజేపీ నేతలు మన పరిపాలన మెచ్చుకుంటారు…గల్ళీలోని బీజేపీ నేతలు విమర్శిస్తారు. ఇదెక్కడి రాజకీయమన్నారు హరీశ్‌రావు.
పళ్లా రాజేశ్వర్ రెడ్డి ఓ ఉద్యమ కారుడు. ఉస్మానియాలో వేణు గోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తరుణంలో మేం అంతా వెళ్లాం. పళ్లా రాజేశ్వర్ రెడ్డి జైలుకు వెళ్లారు. ఆరోజు ఆయన విడుదల కోసం పోరాటం చేశారు. ఉద్యమ కారుల పక్షాన నిలబడి దెబ్బలు తిన్న మనిషి పళ్లా. విద్యావంతుడు, ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి. పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తారు. ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలి. సీఎంకు సన్నిహితంగా, మంత్రులకు సన్నిహితంగా పని చేసిన వ్యక్తి. బీజేపీ వాళ్లు తిరుగుతున్నారు.. వాళ్లకు ఎలా ఓటు వేద్దాం..? బీజేపీ తెలంగాణలో ఏం చేశారని, ఎం ఇచ్చారని ఓట్లు అడుగుతున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
తమిళనాడుకు, గుజరాత్, కేరళ వంటి వాటికి మెట్రో రైళ్లు ఇచ్చారు. తెలంగాణకు మెట్రో ఎక్స్ టెన్షన్ ఇచ్చారా..? ప్రశ్నించే గొంతు అంటున్నారు…ప్రశ్నల ద్వారా సాధించేదేంటి..? టీఆర్‌ఎస్ అంటే ప్రజలే హై కమాండ్ గా భావించే పార్టీ. ప్రజలు ఏది కోరుకుంటుందో అది చెస్తున్నాం. 43 లక్షల మందికి ఆసరా పెన్షన్లు నెలకు రూ. 2016 రూపాయలు ఇస్తున్నాం. ఢిల్లీ నుంచి వచ్చే 1.8 శాతం మాత్రమే. కాని వాళ్లు మేమే ఇస్తున్నామని పచ్చి అబద్దాలు చెబుతున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులకు ఏటా 14 వేల 500 కోట్ల రైతు బంధు ఇస్తోన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ అని హరీశ్‌రావు చెప్పారు. రైతుకు ప్రాధాన్యత ఇచ్చింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం. కరోనా వచ్చినా తెలంగాణలో సంక్షేమం ఆగలేదు. రుణ మాఫీ కొద్దిగా ఆగిందే తప్ప ఆగిపోలేదు. తాత్కాలికంగా ఆగింది తప్ప అది ఇవ్వకుండా ఆపలేదు. ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చుతాం. సొంత జాగాలో ఇళ్లు కట్టే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. సీఎం గారు చెప్పారు. ఈ ఆర్థిక సవంత్సరం తర్వాత ఎవరి ఇంటి జాగాలో వాళ్లు ఇళ్లు కట్టుకునేలా డబ్బులు ఇస్తాం. చెర్యాల అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటానని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.
Read more:
పూర్తిస్థాయిలో టీఎస్ బీపాస్ అమలు.. ఇక నుంచి భవన నిర్మాణాలకు అనుమతులు ఎలా పొందాలంటే..