ఆరోపణలు చేసే ముందు ఆలోచించండి: బీజేపీ నేతలపై ఈటెల మండిపాటు

| Edited By:

Jun 21, 2020 | 4:57 PM

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. రాష్ట్రంపై కేంద్రానికి లేని పోని కట్టు కథలు అల్లి ఫిర్యాదులు చేస్తున్నారని మంత్రి ఈటెల రాజేందర్ మండిపడ్డారు

ఆరోపణలు చేసే ముందు ఆలోచించండి: బీజేపీ నేతలపై ఈటెల మండిపాటు
Follow us on

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. రాష్ట్రంపై కేంద్రానికి లేని పోని కట్టు కథలు అల్లి ఫిర్యాదులు చేస్తున్నారని మంత్రి ఈటెల రాజేందర్ మండిపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్ష హోదాలో ఉన్న జేపీ నడ్డా సైతం తెలంగాణ కరోనా కట్టడిలో విఫలం అయిందని.. తెలంగాణలో మరణాలు ఎక్కువ ఉన్నాయని చిల్లర ఆరోపణలు చేశారని ఆయన విమర్శించారు. ఇతరుల మీద ఆరోపణలు చేసే ముందు బీజేపీ పాలిత ప్రాంతాలు ఏం చేస్తున్నాయో తెలుసుకోవాలని ఆయన సూచించారు. గుజరాత్‌లో కరోనాతో చాలా మంది చనిపోయారని, అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్లా.. లేక గుజరాత్ నుంచి ఉన్న ప్రధాని బాధ్యత వహిస్తారా..? అంటూ ఈటెల ప్రశ్నించారు.

కరోనాపై తెలంగాణలో కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి మరి తమ ముఖ్యమంత్రి నిరంతరం మానిటర్ చేస్తున్నారని మంత్రి అన్నారు. కంటైన్‌మెంట్ అనే పదానికి అర్థం చెప్పిన రాష్ట్రం తెలంగాణనే అని పేర్కొన్నారు. మీ పక్కనే(ఢిల్లీ మర్కజ్) సమావేశలు జరిగితే మీరు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. అసెంబ్లీ వేదికగా విపక్షాలు ప్రధానిపై ఆరోపణలు చేస్తే తమ ముఖ్యమంత్రినే ఖండించారని ఆయన అన్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నప్పుడు దేశానికి ధైర్యాన్ని ఇస్తూ, ప్రధానికి మద్దతు పలికిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు. విదేశీ విమానాలు బంద్ చేయాలని మొట్టమొదటిగా డిమాండ్ చేసింది తమ ముఖ్యమంత్రి అని.. లాక్‌డౌన్‌ని పూర్తి స్థాయిలో అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కరోనా కట్టడి విషయంలో కేంద్ర బృందం తెలంగాణను ప్రశంసిస్తే.. వారిపై ఫిర్యాదు చేసిన నీచ సంస్కృతి బీజేపీ నాయకులదని తూర్పారబట్టారు.

బిక్షం వేసినట్లు 50 ఇచ్చారు:

మీ ఐసిఎంఆర్ ఎన్ని సార్లు గైడ్ లైన్స్ మార్చిందో తెలుసుకోవాలని, అయినా ఆ గైడ్ లైన్స్‌ని తాము పాటించామని ఈటెల పేర్కొన్నారు. 2 లక్షల మాస్క్‌లు మాత్రమే ఇచ్చారని.. 17వేల బెడ్లు మేము సిద్ధంగా పెట్టుకున్నామని అన్నారు. 1000 వెంటిలేటర్స్ అడిగితే బిక్షం వేసినట్టు 50 ఇచ్చారని ఈటెల మండిపడ్డారు. తెలంగాణకు సహకారం ఇవ్వకుండా తాము టెస్టుల కోసం తెచ్చుకున్న యంత్రాలను కలకత్తాకు తన్నుకు పోయారని ఆయన అన్నారు. మీరు మాకు ఏం చేయకున్నా.. మేము వందల కోట్లు ఖర్చు పెట్టి మాస్క్‌లు, పీపీఈ కిట్లు తెచ్చుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఆరోపణలు చేసే ముందు ఆలోచించి చేయాలని ఈటెల మండిపడ్డారు.

Read This Story Also: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు