Minister Errabelli Coments : హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో నూతనంగా ఎన్నికైన టీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సమావేశమయ్యారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, 48 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం మేయర్ అభ్యర్థిగా ఎవరిని నియమించినా ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయని, ఎంజీఎంలో పేషంట్లు పెరుగుతున్నారని అన్నారు. ఆక్సిజన్ కొరత ఏర్పడుతోందని, మరోవైపు ప్రైవేట్ హాస్పిటల్లోను బెడ్స్ ఖాళీగా లేవని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని సూచించారు.
రేపు అధికారులు, ప్రజాప్రతి నిధులతో కలిసి కోవిడ్ సమస్య, ఎంజీఎంలో సౌకర్యాలపై పూర్తి రివ్యూ నిర్వహిస్తామన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సరైన సహకారం లేదని, రావాల్సిన మందులు , ఇతర సదుపాయాలు రావడం లేదని, కరోనా కట్టడిలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. కొత్తగా గెలిచిన కార్పొరేటర్లు కోవిడ్ విషయంలో జనానికి సహకారం అందించాలని హితవు చెప్పారు., సర్వేలో మెజారిటీ డివిజన్లు టీఆరెస్ కు వస్తాయని వచ్చిందని కానీ కొందరు అభ్యర్థులు ప్రచారంలో ఫెయిల్ అయ్యారని అందుకే ఓటమి చెందారని పేర్కొన్నారు.
అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నామని ఇష్టానుసారంగా వ్యహరిస్తే ప్రజలు దూరంగా పెడతారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు భూ వివాదాల జోలికి అస్సలు పోవద్దని సూచించారు. కార్పొరేటర్లుగా గెలిచినవారు భూకబ్జాలు, రౌడీయిజం, అవినీతికి దూరంగా ఉండాలని హితవు చెప్పారు. 2 ప్లాట్లు-4 డబ్బులు వెనకేసుకోవాలి అనే ఆలోచన పక్కన పెట్టాలన్నారు. పదవితో సంబంధం లేకుండా మంచి పేరు కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. జనాల్లో మంచి పేరు ఉంటే భవిష్యత్తులో ఎమ్మెల్యే, ఎంపీ,మినిస్టర్, అవ్వొచ్చని తెలిపారు. తేడాగా ఉంటే జనాలు వేరే రిజల్ట్ ఇస్తారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.