వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను తుఫాన్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మహిళా కూలీలు మృతి.. మంత్రుల సంతాపం
వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం నీరుకుళ్ల శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటన పట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్..
వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం నీరుకుళ్ల శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటన పట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. ఇవాళ ఉదయం కూలీలతో వెళ్తున్న ఆటోను తుఫాను వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడటం బాధాకరమని చెప్పారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు యంత్రాంగంతో మాట్లాడి.. ఘటనకు దారి తీసిన పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాలను ఆదుకుంటామన్నారు.
ఈ ఉదయం వరంగల్ రూరల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల వద్ద తుఫాన్ వాహనం ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కటాక్షపూర్ మూలమలుపు వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను తుపాన్ వాహనం ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ దుర్ఘటనలో మరో 8మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయ్యింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Read More: