AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాంధీలో వైద్యులు, సిబ్బందిని అభినందించిన మంత్రి ఈటల.. కరోనాపై తెలంగాణ విజయం సాధించిందన్న ఆరోగ్యశాఖ మంత్రి

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో తెలంగాణ విజయం సాధించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌..

గాంధీలో వైద్యులు, సిబ్బందిని అభినందించిన మంత్రి ఈటల.. కరోనాపై తెలంగాణ విజయం సాధించిందన్న ఆరోగ్యశాఖ మంత్రి
K Sammaiah
|

Updated on: Mar 02, 2021 | 7:11 PM

Share

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో తెలంగాణ విజయం సాధించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. గడ్డు పరిస్థితులను ఎదుర్కొని.. ప్రజలకు సర్కారు వైద్యంపై విశ్వాసం కల్పించామని ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం గాంధీ వైద్యశాలలో కరోనా వారియర్స్‌ అభినందన సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కరోనా రోగులకు నిరంతరం వైద్య సేవలందించిన వైద్యులు, సిబ్బందిని మంత్రులు శాలువాలతో సత్కరించారు. అనంతరం మంత్రి ఈటల మాట్లాడుతూ అందరికీ తెలంగాణ రాష్ట్రంపై చాలా చిన్న చూపు ఉండేదని, మహమ్మారి పరిస్థితులను ఎదుర్కొనే సత్తా ఉందా? అనే అనుమానం ఉండేదని.. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేశామన్నారు. చైనాలో వచ్చింది కాబట్టి వాళ్లు ఎదుర్కొన్నారు.. ఇండియాలో వ్యాపిస్తే శవాల గుట్టలే ఉంటాయని అన్నారని.. కానీ అలాంటి పరిస్థిని విజయవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు.

ప్రభుత్వాల ప్రయత్నం, సమాజం తోడ్పాటుతోనే సాధ్యమైందన్నారు. మానవ జన్మ గొప్పదిగా భావిస్తారని, కరోనా సమయంలో గాంధీలో పని చేస్తున్న, అలాగే వైద్య, ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ప్రతి ఒక్కరి జన్మసార్థకమైందన్నారు. వైద్యులు, సిబ్బంది కృషితో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందన్నారు. ప్రకృతి గొప్పదని, దాని ఎదుట మనిషి చాలా చిన్నవాడని కరోనా నిరూపించిందన్నారు.

వైద్యో నారాయణో హరిః అనే సూక్తి మళ్లీ నిజమైందన్నారు. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ మూతపడి ఉంటే ప్రజలను ఆదుకునేది ప్రభుత్వ ఆసుపత్రులేనన్నారు. రక్తాన్ని పంచుకొని పుట్టిన కొడుకు, భార్య రాలేని పరిస్థితుల్లో వైద్యులు, నర్సులు ముందుకు వచ్చి సేవలందించారని అభినందించారు. గాంధీ హాస్పిటల్‌లో పని చేస్తున్న వారిని ఇండ్లకు రానివ్వని పరిస్థితులను చూమని, అయినా వారంతా కష్టపడి పని చేశారని కొనియాడారు.

ఇదే కమిట్‌మెంట్‌ రాబోయే రోజుల్లోనూ కొనసాగించాలన్నారు. వైద్యం అనుకోకుండా వచ్చిపడే ఖర్చనీ, గుడిసెల్లో ఉన్నా.. బంగళాలో ఉన్నా వైద్యం కోసం చేయాల్సిన ఖర్చు ఒక్కటేనన్నారు. రూ.35కోట్లతో గాంధీలో ఆర్గాన్స్‌ టాన్స్‌ప్లాంటేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఈటల ప్రకటించారు. క్యాన్సర్‌, కిడ్నీ, హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడి వైద్యలను ఇతర హాస్పిటల్స్‌ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

పేద ప్రజలకు వైద్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందన్నారు. మనిషి ప్రాణం వెల కట్టలేనిదని, ప్రభుత్వ హాస్పిటల్‌లో పని చేసేవారంతా జీతం కోసం పని చేయరని, మీ కష్టాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో గుణాత్మకమైన మార్పు తీసుకు వచ్చి ప్రజల నమ్మకం పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Read more:

మావోయిస్టు కార్యకలాపాలపై పోలీసుల ఉక్కుపాదం.. ఎఎస్పీ ఎదుట లొంగిపోయిన నిషేధిత సీపీఐ మావోయిస్టు మిలీషియా సభ్యులు