ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో మార్పులపై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. త్వరలోనే భారీ మార్పులుంటాయని చెప్పారు. మంత్రివర్గంలోవంద శాతం కొత్తవారినే తీసుకుంటామని సీఎం చెప్పారని వెల్లడించారు. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎంకు చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు. మంత్రివర్గాన్ని వంద శాతం మారుస్తానని సీఎం గతంలో చెప్పారని మంత్రి బాలినేని గుర్తు చేశారు. మంత్రివర్గాన్ని వంద శాతం మారిస్తే మంచిదే అని ముఖ్యమంత్రికి చెప్పానన్న ఆయన.. తనను కూడా మార్చాలని చెప్పానని తెలిపారు. మంత్రి పదవి పోయినా తాను భయపడనని స్పష్టం చేశారు. తనకు పార్టీయే ముఖ్యమని.. పదవులు కాదని పేర్కొన్నారు.
రెండున్నారేళ్ల తరువాత కేబినెట్‌లో మార్పులు ఉంటాయని తొలి సారి మంత్రివర్గం ఏర్పాటు సమయంలోనే సీఎం జగన్ స్పష్టం చేసారు. 90 శాతం వరకు మంత్రులను తప్పించి..కొత్త వారికి అవకాశం ఇస్తామని అప్పట్లో చెప్పుకొచ్చారు. దీంతో..ఇప్పటికే దాదాపుగా రెండేళ్లు పూర్తయి నాలుగు నెలలు అవుతుండటంతో కేబినెట్ విస్తరణపై ఇప్పుడు తెగ చర్చ నడుస్తోంది. దసరా తరువాత ఎప్పుడైనా విస్తరణ ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఇటీవల, పార్టీ కోసం పనిచేసిన నాయకులకు సీఎం జగన్ నామినేటెడ్ పదవులు కేటాయించారు. ఆ సమయంలోనూ ఎమ్మెల్యేలకు రెండు పదవులు వద్దని.. రోజా, జక్కంపూడి రాజా, మల్లాది విష్ణు వంటి వారికి ఉన్న నామినేటెడ్ పదవులను తప్పించారు. ఇప్పుడు కేబినెట్ నుంచి తప్పించిన మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కించుకొనేందుకు చాలామందే ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల టీం కావటంతో అధిష్ఠానం అత్యంత జాగ్రత్తగా ఎంపిక చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో..ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించనున్నారు.
Also Read: తుఫాన్‌కు ‘గులాబ్’ అని నామకరణం.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన