మహారాష్ట్రలో వసూల్ దందా వ్యవహారం సాగుతోందని పార్లమెంటులో విపక్షాలు ఆరోపించాయి. ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం లోక్ సభ ప్రారంభం కాగానే వారు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆ రాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవని, కానీ ఆయనను, సీఎంను కూడా రక్షించడానికి ఎన్సీపీ ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. వీరి ఆరోపణలను తిప్పికొట్టేందుకు శివసేన సభ్యులు కూడా యత్నిస్తు నినాదాలు చేయడంతో సభలో పెద్ద ఎత్తున రభస జరిగింది. బీజేపీ ఎంపీలు రాకేష్ సింగ్, మనోజ్ కోటక్, కపిల్ మోరేశ్వర్ పాటిల్, మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు.. సీఎం ఉద్దవ్ థాక్రే, హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేయాలని, రూ 100 కోట్ల వసూలు అభియోగంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అసలు ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్రలోని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదన్నారు. ‘మహారాష్ట్ర సర్కార్ బర్తరఫ్ కరో ‘వారు నినాదాలు చేశారు. రాజ్యసభలో కూడా ఇదే అంశంపై గందరగోళం జరగడంతో సభను చైర్మన్ కొంతసేపు వాయిదా వేశారు. మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ అంశాన్ని లేవనెత్తబోగా అందుకు చైర్మన్ నిరాకరించారు. ఈ సభలో కూడా శివసేన, జీజేపీ సభ్యుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగాయి. ఒక దశలో శివసేన సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే కాంగ్రెస్, ఎన్సీపీ ఎంపీలు మాత్రం సభలోనే ఉండడం విశేషం.
ఇలా ఉండగా .. పరం బీర్ సింగ్ ఆరోపణలు పసలేనివన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. హోమ్ మంత్రి అనిల్ అసలు ఫిబ్రవరిలో ఏ పోలీసు అధికారిని కలుసుకోలేదని, ఆయన కరోనాతో ఆసుపత్రిలో ఉన్నారని పవార్ చెప్పడాన్ని బీజేపీ అపహాస్యం చేసింది. పరమ్ బీర్ సింగ్ పేర్కొన్న తేదీలకు, పవార్ చెప్పిన తేదీలకు మధ్య అసలు పొంతన లేదని బీజేపీ ట్వీట్ చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Hi-tech copying: పోలీసు నియామక పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్.. మాస్క్‌ల్లో ఇంత సెటప్పా.. మైండ్ బ్లాక్