బీహార్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మహాకూటమి! సీట్ల సర్దుబాటును పూర్తి చేసుకున్న తర్వాత ప్రచారంలోకి దిగింది.. ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది.. మహాకూటమి ఎన్నికల్లో విజయం సాధిస్తే వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లుపైనే తొలి సంతకం ఉంటుందని చెప్పింది.. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలివ్వడం తమ మొదటి ప్రాధాన్యతగా పేర్కొంది. రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్‌పార్టీ, వామపక్షపార్టీలు కలిసి మహాగడ్బంధన్‌గా ఏర్పడిన సంగతి తెలిసిందే.. ఈ ఎన్నికల్లో బీజేపీ మూడు కూటములతో పోటీ చేస్తున్నదని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా అన్నారు.. జనతాదళ్ యునైటెడ్‌తో కలిసి పోటీ చేస్తున్నదని పైకి కనిపించినా, లోక్‌జనశక్తి పార్టీతోనూ, ఓవైసీతోనూ లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నదని రణదీప్ అన్నారు. ఆర్‌జేడీ నేత, కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ కేంద్ర వైఖరిపై విమర్శలు గుప్పించారు.. వరదల కారణంగా తీవ్ర ఇక్కట్లకు గురవుతున్న ప్రజలను ఇంత వరకు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజలను పరామర్శించే తీరిక ఓపిక కేంద్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ప్రజలకు సేవచేయడమే తమ కర్తవ్యమని చెప్పుకునే వారు అధికారం కోసం పాకులాడుతున్నారని తేజస్వీ యాదవ్ అన్నారు.