ఏపీలో బీజేపీకి జనసేన షాక్.. మున్సిపల్‌ ఎన్నికల్లో పాతమిత్రుడితో కలిసి చెట్టాపట్టాల్‌

నసేన పార్టీ తన ప్రస్తుత మిత్రపక్షం బీజేపీని కాదని.. టీడీపీతో పొత్తు పెట్టుకుంది జనసేన. వాస్తవానికి బీజేపీ, జనసేన కూటమి పంచాయతీ ఎన్నికల్లో కూడా కలిసే పోటీచేశారు. కానీ మున్సిపల్ ఎన్నికల్లోకి వచ్చేసరికి..

ఏపీలో బీజేపీకి జనసేన షాక్.. మున్సిపల్‌ ఎన్నికల్లో పాతమిత్రుడితో కలిసి చెట్టాపట్టాల్‌
Follow us
K Sammaiah

|

Updated on: Mar 04, 2021 | 6:21 PM

ఆంధ్రప్రదేశ్‌లో వరుస ఎన్నికలతో పాలిటిక్స్‌ పీక్‌స్టేజ్‌కు చేరుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్‌ ఎన్నికలకు తెరలేపారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌. దీంతో ఎన్నికల సందడి మరింత కోలాహలంగా మారింది. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే అత్యధిక మున్సిపాల్టీలను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ వైసీపీ వ్యూహాలు రచిస్తుంది. మున్సిపల ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కొన్నేళ్ల క్రితమే విడిపోయిన జనసేన, టీడీపీ మళ్లీ జతకట్టడం ఆసక్తిగా మారింది.

జనసేన పార్టీ తన ప్రస్తుత మిత్రపక్షం బీజేపీని కాదని.. టీడీపీతో పొత్తు పెట్టుకుంది జనసేన. వాస్తవానికి బీజేపీ, జనసేన కూటమి పంచాయతీ ఎన్నికల్లో కూడా కలిసే పోటీచేశారు. కానీ మున్సిపల్ ఎన్నికల్లోకి వచ్చేసరికి టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తున్నాయి. అయితే అన్ని మున్సిపాలిటీల్లో కాదు.. ఒకే ఒక్క మున్సిపాలిటీలో ఈ పాత మిత్రుల మధ్య కొత్త స్నేహం చిగురించింది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఇక్కడ బీజేపీని కాదని.. టీడీపీతో పొత్తు పెట్టుకుంది జనసేన.

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మొత్తం 29 వార్డులున్నాయి. ఇందులో 24 వార్డుల్లో టీడీపీ, 5 వార్డుల్లో జనసేన పోటీచేస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు కలిసి కట్టుగా ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థులకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ, జనసేన కలిసి ఖచ్చితంగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని కైవసం చేసుకుంటాయని.. ఐదేళ్ల పాటు పాలన అందిస్తామని ఇరు పార్టీల నేతలు తెలిపారు. కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించుకున్నారని.. ఆయా వార్డుల్లో జనసేన అభ్యర్థులకు మద్దతు తెలుపుతామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బహిరంగంగానే చెబుతున్నారు.

అయితే ఇక్కడ బీజేపీతో కాకుండా టీడీపీతో జనసేన పొత్తుపెట్టకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైసీపీని ఓడించాలంటే ఇలాంటి ఎత్తులు తప్పవని ఆ పార్టీ నేతలు చెబుతుననారు. రాష్ట్రంలో మొత్తం 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గత ఏడాదే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. అక్కడి నుంచే ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అభ్యర్థుల తుది జాబితాను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది.

ఇక మార్చి 10వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రీ పోలింగ్ అవసరమైన చోట మార్చి 13న ఎన్నికలు జరుగుతాయి. మార్చి 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రానికి ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తానికి బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న గ్లాసు పార్టీ.. సైకిల్‌తో జతకట్టడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ పొత్తు ఫలిస్తుందా లేదా అనేది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే మరి.

Read More:

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌లో ముక్కోణపు పోటీ.. జీవీఎంసీపై జెండా ఎగిరేసేందుకు ప్రధాన పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు

రేపు ఏపీ బంద్‌కు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపు.. బంద్‌కు సంఘీభావం తెలిపిన వైసీపీ