ఆ ఎమ్మెల్యేకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్.. తమకు రెండో చెంప చూపించే సంయమనం లేదన్న జనసేన అధినేత
ఏపీలో అధికార పార్టీ వైసీపీ, జనసేన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండు పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. తాజాగా
ఏపీలో అధికార పార్టీ వైసీపీ, జనసేన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండు పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్తాయిలో మండిపడ్డారు. తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్న శ్రీనివాస్.. ఓ ఆకు రౌడీ, బ్యాంకులను దోచేసిన వ్యక్తి అని… ఆయన నుంచి ఇంతకంటే ఎక్కువ ఏమి ఆశిస్తామని పవన్ అన్నారు. వారి దాడులను ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని… దాడులు చేస్తే చూస్తూ కూర్చోమని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఓ వీడియో ప్రకటన విడుదల చేసిన పవన్.. వైసీపీ ఎమ్మెల్యే ఆగడాలను కట్టడి చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కోరారు. లేదంటే శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతుందని హెచ్చరించారు. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించేంత సంయమనం తమ దగ్గర లేదన్నారు. దళితలపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు అక్రమంగా బనాయిస్తే… మానవహక్కుల సంఘానికి తాను స్వయంగ వెళ్లి ఫిర్యాదు చేస్తానన్నారు. దళితులను రక్షించాల్సిన చట్టాన్నే దళితులపై ప్రయోగిస్తున్నారన్నారు.
వ్యక్తిగతంగా దూషణలకు దిగుతున్న… వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాటలను… జనసేన శ్రేణులు పట్టించుకోవద్దని సూచించారు. ‘‘వీధిలో కొన్ని కుక్కలు అరుస్తాయి… కొన్ని పిచ్చికుక్కలు కరుస్తాయి. కరిచినంత మాత్రాన ఆ కుక్కను మనం కరవం కదా. మున్సిపాలిటీ వాళ్లకు ఫోన్ చేస్తాం. వచ్చే వరకు ఆగుతాం. మీకు మాటిస్తున్నాను. మున్సిపాలిటి వ్యాన్ వస్తుంది… అప్పటి వరకు సంయమనం పాటించండి’’ అని పవన్ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
వివాదం వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలోని మత్స్యపురి పంచాయతీలో జనసేన సర్పంచ్ పదవి కైవసం చేసుకుంది. అయితే సర్పంచ్ ర్యాలీ సందర్భంగా జనసేన, వైసీపీ మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. మత్స్యపురిలో జనసేన విజయాన్ని భరించలేని వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మత్స్యపురి గ్రామపంచాయతీలో కారేపల్లి శాంతిప్రియ అనే మహిళ సర్పంచ్ గా పోటీ చేసి గెలుపొందారని, విజయం అనంతరం అంబేద్కర్ విగ్రహానికి దండ వేయగా, ఆ దండను వైసీపీ వాళ్లు తొలగించి ఆమెను దుర్భాషలాడారని, ఆమె ఇంటిపైనా దాడి చేశారని పవన్ ఆరోపించారు. అంతేకాకుండా అనంతలక్ష్మి అనే మత్స్యకార మహిళ ఇంటిపైనా దాడులు చేశారని తెలిపారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలంతా ఎదుటివాళ్లను హింసించడంపైనే దృష్టి పెడుతున్నారని, వారి డీఎన్ఏ అలా ఉందని వ్యాఖ్యానించారు.
స్థానిక ఎమ్మెల్యే సభ్య సమాజం తలదించుకునేలా బూతులు మాట్లాడుతున్నాడు, పైగా వ్యక్తిగతంగా నన్ను దూషిస్తున్నాడు అని పవన్ విమర్శించారు. వారి పీఠం కదులుతుండడంతో కలిగిన భయం వల్లే వైసీపీ నేతలు ఈ విధమైన బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. భీమవరం ఎమ్మెల్యే ఓ ఆకురౌడీ అని, కోపరేటివ్ బ్యాంకులో సొమ్ముదాచుకునే చిన్నచితకా శ్రమజీవులను దోచేసిన వ్యక్తి ఈ వైసీపీ ఎమ్మెల్యే అని ఆరోపించారు. ఇలాంటివాడు వేరే విధంగా ప్రవర్తిస్తాడని ఆశించలేమని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారికి ఎలా సమాధానం చెప్పాలో తమకు బాగా తెలుసని పవన్ స్పష్టం చేశారు.
“ఓ ప్రజాప్రతినిధిగా మీ పరిధిలో మీరు ఉండండి. మీ పరిధి దాటి, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే మిమ్మల్ని ఎలా ఎదుర్కొవాలో మాకు బలంగా తెలుసును. మా వాళ్ల తప్పుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో సరిదిద్దుకుంటాం. అంతేతప్ప ఇళ్లపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దు. ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండాలి. భీమవరంలో గతంలోనూ శాంతిభద్రతలు దెబ్బతిన్నందున డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి చెప్పి వైసీపీ ఎమ్మెల్యే ఆగడాలకు అడ్డుకట్ట వేయించాలి. ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే జరిగే పరిణామాలకు బాధ్యత మాది కాదు” అని పవన్ స్పష్టం చేశారు.
Read more:
నాటు సారా వ్యాపారంలో కొమరాడ తహశీల్దార్.. అక్రమ సంపాదన కోసం రెవెన్యూ అధికారి అడ్డదారి