Huzurabad By Election: హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారైందా.. నోటిఫికేషన్ విడుదల ఎప్పుడంటే..?
ఎన్నికల నోటిఫికేషనే ఇంకా రాలేదు కానీ.. హుజూరాబాదులో జరగాల్సినంత రచ్చ జరుగుతోంది. యాత్రలు.. మాటల తూటాలు కూడా పేలుతున్నాయి.
Huzurabad By Election: ఎన్నికల నోటిఫికేషనే ఇంకా రాలేదు కానీ.. హుజూరాబాదులో జరగాల్సినంత రచ్చ జరుగుతోంది. యాత్రలు.. మాటల తూటాలు కూడా పేలుతున్నాయి. ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ రాజీనామాతో తెలంగాణ రాజకీయాలే మారిపోయాయి. ఒక్కసారిగా అధికార పార్టీతో సహా ప్రతిపక్షాలు రంగంలో యుద్ధానికి సిద్దమయ్యాయి. ఎవరికి వారు లెక్కలేసుకుంటూ బరిలో దిగుతున్నారు. ఉప ఎన్నిక షెడ్యూ్ల్ రాకముందే భారతీయ జనతా పార్టీ తరుఫున ఈటల రాజేందర్ జనంలోకి దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ సైతం అప్పుడే తమ అభ్యర్థి అనౌన్స్‌మెంట్ చేసి మంత్రులకు ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగించింది. ఇక, మరి మిగిలిన పార్టీలు ధీటైన అభ్యర్థులను దించేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పుడు అందరి దృష్టి హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్‌పైనే నెలకొంది. నిజానికి ఆగస్టులోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించారు. కానీ, కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నిక నిర్వహణపై ఈ నెల 28న అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించింది. దీంతో సెప్టెంబర్‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక నగారా మోగే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహించాలని అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ఇదే విషయాన్ని తెలంగాణలోని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇక, అధికార పార్టీ టీఆర్ఎస్ సైతం సెప్టెంబర్‌లోనే ఉప ఎన్నిక ఉంటుందని ప్రచారంలో దూకుడు పెంచింది. అంతర్గతంగా తమ పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తోంది. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఇటీవల ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించి ప్రజలకు మరింత దగ్గరయ్యారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ముఖ్యనేతలందరికీ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లి శ్రీనివాస్ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న మంత్రి హరీశ్ రావు.. అక్కడ పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన తీరుపై ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతున్నారు. మరోవైపు హుజూరాబాద్‌లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయనే దానిపై క్షేత్రస్థాయి నుంచి వివిధ వర్గాల ద్వారా సీఎం కేసీఆర్ వేదికలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం.ఇందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులకు కేసీఆర్ సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదిలావుంటే, హుజూరాబాద్ ఉప ఎన్నిక సెప్టెంబర్‌లో జరుగుతుందన్న టీఆర్ఎస్, బీజేపీ ఆలోచన వెనుక వెనుక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఏపీలోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మార్చి 28న అకాల మరణం చెందారు. సెప్టెంబర్ 28 నాటికి ఆయన మరణించి ఆరు నెలలు పూర్తి కానుంది. నిబంధనల ప్రకారం శాసనసభ్యుడు మరణించినా లేక రాజీనామా చేసినా ఆరు నెలల్లో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గడువులోపే ఎన్నిక నిర్వహించడం అనివార్యం. దీంతో ఏ క్షణానైన ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, కరోనా కారణంగా ఎన్నికల నిర్వహణను కేంద్ర ఎన్నిక సంఘం వాయిదా వేస్తూ వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడుతుండటంతో.. కేంద్రం ఉప ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే ఏపీలోని బద్వేలు నియోజకవర్గంతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గానికిఉప ఎన్నిక కూడా జరుగుతుందని తెలంగాణ రాజకీయ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఏపీలోని బద్వేలు నియోజకవర్గంతో పాటే తెలంగాణలోని హుజూరాబాద్‌కు కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ శ్రేణులకు సంకేతాలు కూడా పంపినట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా రావొచ్చని.. అంతా సిద్ధంగా ఉండాలని సూచించినట్టు సమాచారం.
మరోవైపు హుజూరాబాద్‌లో గెలిచి టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వాలని భావిస్తున్న బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈటల రాజేందర్ ఒక్కరే ప్రచారంలో దూసుకుపోతున్నా.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్రంలోని బీజేపీ నేతలతో పాటు జాతీయ నేతలు కూడా ప్రచారం పర్వంలోకి దిగుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. మొత్తానికి సెప్టెంబర్‌లో అయినా హుజూరాబాద్ ఉప ఎన్నికకు నగారా మోగుతుందా లేక ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం మరికొంత సమయం తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.