Andhra Pradesh: రాజకీయపార్టీలలో భిన్నాభిప్రాయాలు సహజమే. కానీ స్వపక్షంలో విపక్షంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీ అధినేత నిర్ణయాలను ప్రశ్నించే నేతలు బహు తక్కువగా ఉంటారు. అందులోనూ ప్రాంతీయ పార్టీలలో అధ్యక్షుని నిర్ణయాలను విమర్శించేవారు చాలా అరుదు. సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లో అధిష్టానాన్ని విమర్శించిన వారికి ఇక ఆ పార్టీలో నూకలు చెల్లినట్లే అనేది రాజకీయాలు తెలిసిన వారెవరైనా చెప్పే మాట. అయితే, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్న విషయం పార్టీలోనే ఉంటూ సొంత ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తున్న నేతల వైఖరి.
జగనన్న ఇళ్లపై అధికార పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇటీవల వెరైటీ వ్యాఖ్యలు చేశారు. కొత్తగా పెళ్లి అయిన వారికి శోభనానికి కూడా ఈ ఇళ్లలో బెడ్ రూం సరిపోదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. అంతేకాదు.. శోభనం హాలులో చేసుకుని బెడ్ రూమ్‌లో పడుకునేందుకు వెళ్లాల్సి వస్తుందేమో అంటూ కామెంట్స్ చేశారు. ఇదిప్పుడు ఆంధ్రా రాజకీయాల్లో సంచలనంగా మారింది.
అసమ్మతి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అంటే అతిశయోక్తి కాబోదు. కానీ, వారిలో వారు కొట్లాడుకుంటారుగానీ, పార్టీ అధిష్టానాన్ని విమర్శించరు. వివిధ పదవులు పంపకాలు జరిగినప్పుడు ఈ విమర్శలు మరింత ఎక్కువ అవుతాయి. రేవంత్‌రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమించడంతో అక్కడ కాంగ్రెస్ లో ఇప్పుడు సెగలు రేగుతున్న పరిస్థితి ఉంది. రేవంత్‌రెడ్డి ఎంపికపై తీవ్ర విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి. ఓటుకు నోటు మాదిరిగా పీసీసీ పోస్టు అమ్ముడుపోయిందంటూ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై తన అసంతృప్తితో టీపీసీసీ ఎన్నికల కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు మర్రి శశిధర్‌రెడ్డి.
గతంలో సొంత పార్టీ వ్యవహారాలపై విమర్శలు చేసిన నేతలు కూడా ఉన్నారు. కానీ, అధికారంలో ఉంటూ తమ ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేయడం మాత్రం ఏపీలో ఇప్పుడు కొత్తగా చూస్తున్న వైఖరి అని పరిశీలకులు అంటున్నారు. ఇక్కడ వైసీపీలో వెరైటీ విమర్శలు కనిపిస్తున్నాయి. ఏపీలో ఇసుక కొరత, ప్రభుత్వ ఇసుక విధానంపై అనేకమంది వైసీపీ నేతలు అప్పట్లో విమర్శలు చేశారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ”ఏ ఒక్క గ్రామంలోనూ దోసెడు ఇసుక ఇచ్చే పరిస్థితి లేదు, రీచ్ నుంచీ యార్డ్‌కు వచ్చేటప్పటికి లారీ మాయమవుతోంది.” అంటూ విమర్శించారు. అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ”గోదావరి చుట్టూ ఇసుక ఉన్నా ఎక్కడికో వెళ్లాల్సి వస్తోంది.” అన్నారు.
ఇక ఆనం రామనారాయణరెడ్డి అయితే, తన నియోజకవర్గాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. అభివృద్ధి శూన్యంగా మారింది. జలవనరుల శాఖ నీటినే అమ్ముకుంటోంది. ప్రజల కోసం పోరాటానికి సిద్ధం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణిపై ఆమె మామ, వైసీపీ నేత శత్రుచర్ల చంద్రశేఖర రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీకి అనుకూలంగా లేని పేదలెవ్వరికి కూడా, అర్హత ఉన్నప్పటికీ పెన్షన్లు ఇవ్వడం లేదని, జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం కూడా చేపట్టలేదని, రోడ్లు, తాగునీరు కూడా లేవని విమర్శలు గుప్పించారు.
అయితే, ఇటువంటి విమర్శలు గతంలోనూ అధికార పార్టీ నాయకులు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఈసారి అవి మరింత ఎక్కువగా కనబడుతున్నాయనేది విమర్శకులు అంటున్న మాట. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు కూడా కొంతమంది నాయకులు చంద్రబాబు నాయుడి మీదే నేరుగా విమర్శలు చేసిన సందర్భాలూ ఉన్నాయి.
గతంలో టీడీపీ హయాంలోనూ ఇటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ అధికారంలో ఉండగా 2014లో టీడీపీలో చేరి ఎంపీ అయినప్పటికీ నిరంతరం తన విమర్శలతో చంద్రబాబును జేసీ దివాకర్‌రెడ్డి ఇరుకున పెట్టేవారు. జగన్ మావాడేనని, క్షేత్రస్థాయిలో టీడీపీ పరిస్థితి ఏమీ బాగాలేదని తరచుగా జేసీ దివాకర్‌రెడ్డి కామెంట్లు చేసేవారు. చంద్రబాబు వల్లే పార్టీ అధికారంలోకి రాలేదని, అప్పటి పరిస్థితిని బట్టి టీడీపీలో చేరినట్లుగా ప్రకటనలు చేశారు. ఇక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ… చంద్రబాబు ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లాంటివాడని తీవ్ర విమర్శలు చేశారు. 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచి, చంద్రబాబుపై విమర్శలు రువ్విన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, బాలా నాగిరెడ్డి వైఎస్‌ఆర్‌తోనూ, తరువాత జగన్‌తోనూ సన్నిహితంగా మెలిగి తరువాత వైసీపీలో చేరారు.
అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కాంగ్రెస్ నాయకుల మధ్య సర్వసాధారణం. సీఎంగా ఎవరు ఉన్నా వారిని దింపే వరకూ గతంలో అసమ్మతి రాజకీయాలు నడిపే అలవాటు ఆ పార్టీ సొంతం. వైఎస్సార్ సీఎంగా ఉండగా ఆయనపై వీ హనుమంతరావు, పిజేఆర్, పాల్వాయి గోవర్దన్ రెడ్డి, పాలడుగు వెంకట్రావు, మర్రి శశిధర్‌రెడ్డి వంటి నేతలు విమర్శలు చేస్తూనే ఉండేవారు.
Also Read: Krishna Water: ముదురుతున్న జలజగడం.. దమ్మెత్తిపోసుకుంటున్న తెలుగురాష్ట్రాల మంత్రులు