ఏపీ పోలీసులను అభినందించిన డీజీపీ.. పంచాయతీ స్ఫూర్తితో రాబోవు ఎన్నికల్లో పని చేయాలన్న గతమ్‌సవాంగ్‌

|

Feb 23, 2021 | 6:06 PM

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన రాష్ట్ర పోలీసు అధికారులకు, ఇతర ప్రభుత్వ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు..

ఏపీ పోలీసులను అభినందించిన డీజీపీ.. పంచాయతీ స్ఫూర్తితో రాబోవు ఎన్నికల్లో పని చేయాలన్న గతమ్‌సవాంగ్‌
Follow us on

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన రాష్ట్ర పోలీసు అధికారులకు, ఇతర ప్రభుత్వ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు రాష్ట్ర డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్. ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో కనపరిచిన తీరు, సేవాతత్పరత, సమయస్ఫూర్తి, ముందస్తు చర్యలు, అన్ని శాఖలతో సమన్వయం, ఇవన్నీ కలిపి నాలుగు విడతలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వర్తించడానికి దోహద పడ్డాయన్నారు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటనకు ఆస్కారం లేకుండా ప్రజలందరూ ఉత్సాహంగా, స్వేచ్ఛగా అధికశాతంలో ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకొన్నారని చెప్పారు.

రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కి ఆస్కారం లేకుండా ఎన్నికలు నిర్వహించాం. ఘర్షణ వాతావరణం ఉంటుందేమోనన్న భావన, భయాందోళన వివిధ అపోహలు ప్రజలలో ఉన్నప్పటికీ వాటన్నింటిని అధిగమించి ప్రశాంతంగా పోలింగ్‌ సాగేలా పని చేశామన్నారు. శాంతియుతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించుకోవడం రాష్ట్ర పోలీసు శాఖ యొక్క అద్భుతమైన పరిణామం మరియు పనితీరుకు నిదర్శనం అన్నారు డీజీపీ. ప్రతి విడతలోనూ 70 వేల మంది పోలీసు సిబ్బంది అలుపెరగక విధులు నిర్వహించారని చెప్పారు.

పోలీస్‌ సిబ్బంది ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, పారదర్శకమైన విధులు నిర్వహించి ప్రజలకు రక్షణ కల్పించి వారికి దైర్యన్ని,నమ్మకాన్ని ,బరోసాను అందించి వారి మన్ననలను పొందారు. ఎన్నికల నిర్వహణకు అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ సమర్థవంతంగా ప్రణాళికలు రూపొందించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద పీట వేస్తూనే, నడవలేని స్థితిలో ఉన్న, అచేతనంగా ఉన్న, వృద్ధులకు, వికలాంగులకు, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి, సొంత బంధువుడిలా, కుటుంబ సభ్యునిలా సహకరించారు .పోలీస్ శాఖ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి పారదర్శక మైన , నిజాయితీ, నిస్వార్థంతో కూడిన సేవలను అందించిన పోలీస్ సిబ్బందిని అభినందించడం గర్వంగా ఉందన్నారు.

అనేక పోలింగ్ కేంద్రాల వద్ద వృద్దులను పోలీస్‌ సిబ్బంది వారి చేతులపై మోసుకుని ఓటు వేయడానికి సహకరించారు. ఖాకీ మాటున ఖాటిన్యమే కాదు, మానవత్వం నిండిన హృదయం దాగి ఉందని నిరూపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో తమ వంతు పాత్రను అద్భుతంగా పోషించారని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది చేసిన సేవకు విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకునేలా చేసింది. ఇది ప్రజల ఆకాంక్షలకు ప్రభుత్వ విధివిధానాలకు, ఆదేశాలకు అనుగుణంగా పోలీస్ సిబ్బందిలో మార్పు పరివర్తనలతో సేవా దృక్పథం వెల్లివిరిసింది. 2013 గ్రామ పంచాయతీ ఎన్నికలలో జరిగిన ఘర్షణలతో పోల్చుకుంటే ఈ సారి అత్యంత స్వల్ప ఘర్షణలు మాత్రమే జరిగాయని వివరించారు.

నేర ప్రవృత్తి కలిగిన వారిని ముందస్తు బైండోవర్ చేయడం , ప్రజలను ప్రలోభాలకు గురి చేసే డబ్బు, మద్యo పంపిణీ జరగకుండా పోలీస్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రత్యేక నిఘా పెట్టడం, ఇవన్నీ కలిపి విజయవంతమైన ఎన్నికల నిర్వహణకు సాధ్యపడింది. అందుకు ఉదాహరణగా అనంతపురం,ప్రకాశం,నెల్లూరు జిల్లాలలో స్పష్టమైన మార్పు కనిపించింది. అనుక్షణం అప్రమత్తతో సత్వర స్పందన తో చెదురు మదురు సంఘటనలు మినహా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించినందుకు గాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్,గౌరవ ముఖ్యమంత్రి గారు సైతం రాష్ట్ర పోలీసు శాఖ యొక్క సేవలను కొనియాడారు. నిస్సహాయులైన వృద్ధులకు, వికలాంగులకు చేసిన సేవలను గురించి ప్రత్యేకంగా అభినందించారు.

ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసులు తమ వాక్సినేషన్ ప్రక్రియను త్యాగం చేసి వాయిదా వేసుకోవడం జరిగింది.ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులకు సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభిస్తామని, ఈ వ్యాక్సిన్ను కిందిస్థాయి సిబ్బంది అందరికీ చేరేలా కసరత్తు మొదలు పెట్టడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి ఎలా విజయవంతం అయ్యామో, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాబోవు ఎన్నికల నిర్వహణలో కూడా ఇటువంటి స్ఫూర్తి కొనసాగించి విజయవంతంగా వాటిని కూడా పూర్తి చేయాలని, సిబ్బందికి తెలియజేశారు.

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, SEC సూచనల మేరకు వివిధ శాఖల సహాయసహకారం, సమన్వయంతో విజయంతంగా పోలీస్ శాఖ 2021 గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది.అందుకు అన్ని శాఖలకు ప్రత్యేక అభినందనలు. అదే విధంగా రాబోయే ఎన్నికలను ఇదే స్ఫూర్తితో విజయవంతం చేస్తారని ఆకాంక్షిస్తున్నానని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు.

Read More:

జేసీపై బీసీ మంత్రి మండిపాటు.. సీఎం జగన్‌పై ఆ ఆరోపణలకు కౌంటర్‌ అటాక్‌ చేసిన శంకర్ నారాయణ