Chalmeda Lakshmi Narasimha Rao: చెన్నమనేని టూ చల్మెడ వయా వేములవాడ. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. కరీంనగర్ జిల్లా పీసీసీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత చల్మెడ లక్ష్మీ నరసింహరావు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువ కప్పుకున్నారు. అయితే దీని వెనుక ఏం జరిగింది? ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేష్ ఉన్నారు. మరి చల్మెడను ఎందుకు పార్టీలో చేర్చుకున్నారు అన్నది ఇప్పుడు హాట్‌టాఫిక్. చల్మెడ చేరికపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
వేములవాడ ప్రజెంట్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్. 2009 నుంచి ఇక్కడ ఆయనే ఎమ్మెల్యే. అయితే రమేష్ పౌరసత్వంపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన భారత పౌరుడు కాదు. జర్మనీ పౌరుడు. అలాంటప్పుడు దేశంలో ఆయన ఎన్నికల చెల్లదు అంటూ ఏళ్లతరబడి కోర్టుల్లో కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఏ క్షణం కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో అనే టెన్షన్ అధికార పార్టీలో నెలకొంది. కోర్టు కేసులు పక్కన పెడితే ఆయన స్థానికంగా అందుబాటులో ఉండడు అన్నది మరో అపవాదు. పేరుకే వేములవాడ ఎమ్మెల్యే. ఉండేది మాత్రం విదేశాల్లో అనే అసంతృప్తి ఉంది.
ఈ ఇబ్బందులు, చిక్కుముళ్లు ఎందుకు అనే భావనలో ఉందట TRS. అందుకే ఇక్కడ ప్లాన్-B అమల్లో పెట్టారన్న టాక్ నడుస్తోంది. 2009, 2014లో కాంగ్రెస్ నుంచి కరీంనగర్ శాసన సభకు పోటీ చేసిన చల్మెడ లక్ష్మి నరసింహ రావును రంగంలోకి దింపారు. ఆయనకు వేములవాడ టిక్కెట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇదే జరిగితే ఇక చెన్నమనేని రమేష్ పొలిటికల్ కెరీర్‌కు తెరపడుతుంది. అటు చెన్నమనేని ఫ్యామిలికి కూడా ఇదే చివరి టర్మ్ అనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.
చల్మెడ చేరికతో వేములవాడ అనిశ్చితికి ఇక తెరపడినట్లే అంటున్నాయి TRS శ్రేణులు. ఒకవేళ చెన్నమనేని రమేష్‌పై కోర్టు తీర్పు వెలువడి ఇప్పటికిప్పుడు బైపోల్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీశ్రేణులకు సూచించారట గులాబీ బాస్.
ఇవి కూడా చదవండి: Army Helicopter Crash: హెలికాప్టర్ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..