Etela Rajender: తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ హుజూరాబాద్ ఉప ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌కి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు టీఆర్‌ఎస్.. ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌ని ఉప ఎన్నికల అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
దౌర్జన్యం జరిగితే ముందుగా చిందవలసింది తన రక్తపు బొట్టేనని, కేసులు పెట్టినా, జైళ్లో పెట్టినా ముందుగా తననే పెట్టాలని అన్నారు. తాను నియోజకవర్గానికి ఏమీ చెయ్యక పోతే ప్రజలు ఆరు సార్లు ఎలా గెలిపించారని ప్రశ్నించారు. తన జోలికి రావొద్దని, సముద్రం ప్రశాంతంగా ఉన్నా ప్రళయం సృష్టిస్తుందంటూ హెచ్చరించారు. తన కొట్లాట బానిసల మీద కాదన్న ఈటల.. కేసీఆర్ మీద అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు డబ్బు ప్రజా సొమ్మన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ డబ్బుకి ఓనర్ కాదని, కేవలం కాపాలాదారుడు మాత్రమేనని గుర్తుంచుకోవాలన్నారు. దమ్ముంటే డబ్బులు, మద్యం, పక్కన పెట్టి పోటీ చెయ్యాలని సవాల్ చేశారు.
వినోద్ కుమార్ కి ఎక్కడ ఓట్లు రాకపోయినా హుజూరాబాద్ పరిధిలో 57వేల మెజారిటీ అందించానని చెప్పుకొచ్చారు. అయన కూడా తనను రాజీనామా చేయమని అడిగారన్నారు. రాజీనామా చేసి మీ ముందుకు వచ్చానని, తనను కాపాడుకోవాలని ప్రజలను కోరారు. తన రాజీనామాతో ప్రజలకు చాలా వచ్చాయని అన్నారు.