తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. కోమటిరెడ్డితోపాటు మరో ఐదారుగురు నేతలు పోటీ పడుతున్నారు. టీపీసీసీ చీఫ్ పదవి కోసం మధుయాష్కీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే మరికొందరు నేతలు సైతం ఇందుకోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారు కూడా ఉన్నారు. ఆశావహులంతా కుటుంబాలతో సహా ఢిల్లీలో వాలిపోయారు.
అయితే.. TPCC ఆశావహులు రోజు రోజుకు పెరుగుతున్నారు. దీంతో TPCC చీఫ్ ఎంపికపై తెలంగాణలోని సీనియర్ నేతలు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా భద్రాచలం ఎంఎల్‌ఏ పొదెం వీరయ్య హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ భావజాలం విశ్వసించే వారికే పీసీసీ పదవి ఇవ్వాలని ఆయన ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాకు లేఖ రాశారు. ఇందులో
TPCC అధ్యక్షుడిగా పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పీసీసీ ఇచ్చే ముందు వారి ట్రాక్ రికార్డ్ కూడా ఓసారి చూసి ఇవ్వాలని కోరారు. అంతే కాకుండా గాంధీ కుటుంబ విధేయులైనవారిని మాత్రమే ఎంపిక చేయాలని ఆయన నొక్కి చెప్పారు.
దుబ్బాక ఉప ఎన్నికలు , జీహెచ్ఎంగా ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీపీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఈ పదవి కోసం పోటీ పెరిగింది.దీంతో కొత్త అధ్యక్షుడి నియామకం ఏఐసీసీకి అనివార్యంగా మారింది.