టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి మంత్రుల నుంచి కౌంటర్ అటాక్ మొదలైంది. సీఎం జగన్ ఒక్కరోజు సంపాదన రూ.3 వందల కోట్లు అంటూ సంచలన ఆరోపణలు చేసిన జేసీకి అదే స్థాయిలో మంత్రి శంకకర్ నారాయణ కౌంటర్ ఇచ్చారు. అనంతరపురం జిల్లాలో జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబం చేసే అరాచకాలు తాడిపత్రి ప్రజలకు తెలుసని అన్నారు శంకర్ నారాయణ.
అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి దివాకర్‌రెడ్డి కేసుల్లో ఇరుక్కున్నారని మంత్రి శంకర్‌నారాయణ ఆరోపించారు. అక్రమ మైనింగ్ విషయంలో కోర్టులే జేసీ దివాకర్‌రెడ్డికి అక్షింతలు వేశాయని గుర్తుచేశారు. జేసీ దివాకర్‌రెడ్డి అక్రమ సంపాదన, దౌర్జన్యాలు, హత్యలు అందరికీ తెలుసని చెప్పారు. జేసీ వ్యాఖ్యలు చూస్తుంటే దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
జేసీ దివాకర్‌రెడ్డి పూటకో రకంగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి శంకర్‌నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఏడాదిన్నరలో రూ.70 వేల కోట్ల సంక్షేమ పథకాలు అందించినట్లు మంత్రి శంకర్‌నారాయణ వివరించారు. ఇప్పటికైనా అసత్య ఆరోపణలు ఆపకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Read more:
ఏపీ సీఎం జగన్ ఒక్కరోజు ఆదాయం ఎంతో తెలుసా..? ఆ సీక్రెట్ చెప్పేసిన జేసీ దివాకర్ రెడ్డి