నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్‌.. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరిన ఏపీ ముఖ్యమంత్రి

రాష్ట్ర విభజనతో ఎంతో నష్టపోయాం, విభజన హామీ మేరకు ప్రత్యేకే హోదా ఇవ్వాలని ఏపీ సీఎం జగన్‌ ప్రధాని మోదీని కోరారు. మౌలిక వసతులు..

నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్‌.. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరిన ఏపీ ముఖ్యమంత్రి
Follow us
K Sammaiah

|

Updated on: Feb 21, 2021 | 4:57 AM

రాష్ట్ర విభజనతో ఎంతో నష్టపోయాం, విభజన హామీ మేరకు ప్రత్యేకే హోదా ఇవ్వాలని ఏపీ సీఎం జగన్‌ ప్రధాని మోదీని కోరారు. మౌలిక వసతులు, ఉద్యోగ అవకాశాల కల్పన, ఆర్థికంగా పుంజుకోవడంతో పాటు, పారిశ్రామికంగా వేగంగా ఎదగడం వంటివి ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’తోనే సాధ్యమవుతుందని సీఎం స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో జరిగిన నీతి ఆయోగ్‌ 6వ పాలక మండలి సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు.

ఉత్పత్తి, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అభివృద్ధి, క్షేత్రస్థాయిలో సేవల డెలివరీ, ఆరోగ్యం, పౌష్టికాహారం అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని విభజనకు ముందు పార్లమెంటు సాక్షిగా ప్రకటించినట్లు గుర్తుచేశారు. ఏపీలో కనీసం టయర్‌-1 నగరం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన అంశాలు సీఎం వైఎస్‌ జగన్‌ మాటల్లోనే..

‘కోవిడ్‌ మహమ్మారితో ఆర్థిక పరిస్థితి తలకిందులైన నేపథ్యంలో జరుగుతున్న నీతి ఆయోగ్‌ సమావేశం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. కోవిడ్‌ కారణంగా దెబ్బ తిన్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకు ఎక్కించడానికి ఉన్న అవకాశాలన్నింటినీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారం, సంప్రదింపుల ద్వారా పరిశీలించాలి. దీనికోసం అర్థవంతమైన చర్చలు జరగాలి. దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేలా ఒక నిర్దిష్ట విధానాన్ని రూపొందించుకోవాలి’ అని సీఎం వైఎస్‌ జగన్ నీతి ఆయోగ్‌ సమావేశంలో తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరు ప్రధాన అంశాలు అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు.

‘భారత్‌ను ఉత్పత్తి, తయారీ రంగంలో అద్భుత విజయాలు సాధించిన దేశాలు అవలంభించిన విధానాలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. అన్ని వాస్తవాలను నిశితంగా విశ్లేషించుకోవాలి. నా అభిప్రాయం ప్రకారం ఉత్పత్తి, తయారీ రంగంలో భారత్‌ విజయానికి ఐదు రకాల అంశాలు అవరోధంగా మారాయి’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ‘రుణాలపై అధిక వడ్డీల భారం, విద్యుత్‌ ఖర్చులు అధికంగా ఉండడం, భూ సేకరణలో జాప్యం, అనుమతుల మంజూరులో సంక్లిష్టత, దేశంలో ఉత్పత్తి, తయారీ రంగానికి అవరోధంగా మారాయి. కాబట్టి వీటన్నింటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారా సంస్కరణలు తీసుకువచ్చి ఉత్పత్తి, తయారీ రంగంలో ఉన్న అవరోధాల నుంచి గట్టెకాల్సి ఉంది’ అని సీఎం జగన్‌ చెప్పారు.