Anantapur Politics: నిన్నటి వరకు సైలెంట్ గా కనిపించిన ఆ యంగ్ లీడర్.. ఇప్పుడు జోరు పెంచారు. మాటలు తూటాలు పేలుతున్నాయి.. పంచ్ డైలాగ్ లతో టీడీపీ జోష్ నింపుతున్నారు. కానీ ఆయన ఫైటింగ్ ఒక్క వైసీపీతోనే కాదు.. మొన్నటి వరకు టీడీపీలో ఉండి బయటకు వెళ్లిన నేతతో కూడా.. ఇప్పుడు ఆ నేతపై చేస్తున్న కామెంట్స్… అనంతపురం జిల్లా పాలిటిక్స్ ని హీటెక్కిస్తున్నాయి. ఇంతకీ ఆ యువనేత ఎందుకు స్పీడ్ పెంచారు..? ఎందుకు ఆ నేత టార్గెట్ అయ్యారు?
పరిటాల శ్రీరామ్.. రాయలసీమ ప్రాంతంలో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ లీడర్. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ కాస్త సైలెంట్ గా కనిపించారు. కానీ గత నెల రోజులుగా శ్రీరామ్ దూకుడు పెంచారు. సంచలన కామెంట్స్ చేస్తున్నారు.. ప్రత్యర్థులపై పంచ్ డైలాగ్ లతో పార్టీలో జోష్ తీసుకొస్తున్నారు. కానీ శ్రీరామ్ మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు ధర్మవరంలో అగ్గి రాజేస్తున్నాయి. అసలు రాప్తాడులో ఉండాల్సిన శ్రీరామ్ ధర్మవరం ఎందుకు వెళ్లారు.. అక్కడ ఆయన చేస్తున్న ఫైట్ ఎవరితో అంటే.. రెండున్నరేళ్ల ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ.. 2019ఎన్నికల్లో ఓటమి తర్వాతా.. కేవలం నెల రోజుల వ్యవధిలోపే కండువా మార్చేశారు. టీడీపీ నుంచి కాషాయం గూటికి వెళ్లారు. దీంతో యంగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డికి ధర్మవరంలో ఎదురే లేకుండా పోయింది. టీడీపీలో తీవ్ర నైరాశ్యం… అసలు కష్టమొస్తే చెప్పుకునే నాయకుడు లేకుండా పోయారు. అప్పుడు సరిగ్గా ఎంట్రీ ఇచ్చారు పరిటాల శ్రీరామ్….
ధర్మవరం ప్రాంత టీడీపీ నేతలు పంతం పట్టి, అధినేతపై ఒత్తిడి తెచ్చి మరీ శ్రీరామ్ ను ధర్మవరం తీసుకొచ్చారు. చంద్రబాబు సైతం ధర్మవరం టీడీపీ పగ్గాలు శ్రీరామ్ కు ఇచ్చేశారు. అయినప్పటికీ కొంత స్లోగా కనిపించారు. కానీ గత నెల నుంచి శ్రీరామ్ దూకుడు చూస్తుంటే.. ఇటు వైసీపీకి అటు పార్టీ నుంచి వెళ్లిపోయిన సూరీ వర్గీయుల్లో కలవరం మొదలైంది. ప్రత్యేకించి శ్రీరామ్ ఎమ్మెల్యే కేతిరెడ్డితో పాటు అటు పార్టీ నుంచి వెళ్లిపోయిన సూర్యనారాయణపై విరుచుకపడుతున్నారు. అసలు సూర్యనారాయణ ఎందుకు టార్గెట్ అయ్యారంటే.. పార్టీ నుంచి వెళ్లిపోయిన సూర్యనారాయణ.. మళ్లీ టీడీపీలోకి వస్తున్నారని.. ఇక్కడ శ్రీరామ్ దుకాణం ఖాలీ చేయాల్సిందేనంటూ ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆయన రాక వాయిదా పడినట్టు కూడా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై శ్రీరామ్ పంచ్ డైలాగ్ లతో అటాక్ చేశారు. ఒకయాన పార్టీలోకి వస్తారని.. ప్రతి పబ్లిక్ హాలిడేకీ ప్రచారం చేస్తుంటారు. వస్తే రానివ్వండి.. పార్టీ కండువా కప్పుతా.. కష్టపడి పని చేస్తే ఏదో ఒక పదవి ఇస్తానన్నారు. ఇది సూరీ వర్గీయులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి…
సోషియల్ మీడియాలో కొందరు వ్యక్తులు శ్రీరామ్ పై కామెంట్స్ చేయడంతో శ్రీరామ్ మరింత ఘాటుగా పెంచారు. ఆయన పార్టీలోకి వచ్చి ధర్మవరం టికెట్ తీసుకుంటే.. నేను రాజకీయాలు వదిలేస్తానని సంచలన కామెంట్స్ చేశారు. ఆయనకు టికెట్ వచ్చేది లేదు.. నేను రాజకీయాలు వదిలేది లేదు. అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లిన జరిగేది ఇదేనని తేల్చి చెప్పారు. శ్రీరామ్ ఇలా స్ట్రాంగ్ అటాక్ చేస్తున్నా.. సూర్యనారాయణ నుంచి మాత్రం నో కామెంట్ అన్న సమాధానమే వస్తోంది. అలా అని పార్టీలోకి వస్తున్నానని కానీ రానని కానీ చెప్పడం లేదు. ఆయన వర్గీయులు మాత్రం శ్రీరామ్ కు కౌంటర్స్ ఇస్తున్నారు…
ఇలా శ్రీరామ్ దూకుడు చూస్తుంటే.. ధర్మవరంలో బలమైన పునాది వేసేలానే కనిపిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఆయన వ్యాఖ్యలు మాత్రం ధర్మవరంలో హీట్ పెంచుతున్నాయి.
– లక్ష్మీకాంత్, అనంతపురం జిల్లా, టీవీ9 తెలుగు
Also Read..
యవతపై యోగీ సర్కార్ వరాల జల్లు.. వాజ్‌పేయి జయంతి సందర్భంగా టాబ్స్, స్మార్ట్ ఫోన్ల పంపిణీ..
Pawan Kalyan: అంత త్యాగం అవసరం లేదు.. ఈ పని చేయండి చాలంటూ వైసీపీ ఎంపీలకు పవన్ చురకలు..