ఓటరుగా దరఖాస్తు చేసుకోవడానికి మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అయినప్పటికీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలో నిర్ణీత గడువులోగా వచ్చిన దరఖాస్తులనే అనుబంధ జాబితాలో చేరుస్తారు. రాష్ట్రంలో ఏప్రిల్ 11న జరగనున్న పోలింగ్ కోసం మార్చి 18 నుంచి నామినేషన్లను స్వీకరించనున్న విషయం తెలిసిందే. నామినేషన్ల దాఖలుకు చివరి గడువు మార్చి 25. సహజంగా నామినేషన్ల చివరి రోజుకు పది రోజుల ముందు వరకు వచ్చిన దరఖాస్తులనే ఈసీ పరిష్కరిస్తుంది. అంటే మార్చి 15వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలించి లోక్‌సభ ఎన్నికల ఓటర్ల జాబితాలో అనుబంధంగా చేరుస్తారు.