గత కొన్నేళ్లుగా చెట్లను పెంచండి అంటూ ప్రభుత్వాలు.. పర్యావరణ పరిరక్షణ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. మానవ మనుగడ సహజంగా సాగాలంటే మనకు ఆక్సిజన్ ఉండాలి.. అందుకు చెట్లు కచ్చితంగా ఉండాల్సిందే. కానీ ప్రస్తుతం ఆధునికత, పట్టణీకరణ, అభివృద్ధి పేరుతో చెట్లను నరికేస్తున్నారు.
ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్ని చెట్లు ఉన్నాయనేది ఎవరు అంచనా వేయలేదు. ఒకవైపు వేల సంఖ్యలో మొక్కలు నాటుతున్నా.. మరోవైపు అంతకు రెట్టింపు చెట్లను నరికేస్తున్నారు. మానవుడి టెక్నాలజీకి ఇప్పటి వరకు ఎన్నో అడవులు కనుమరుగయ్యాయి.
తాజాగా రీడర్స్ డైజెస్ట్ నివేదికా ప్రకారం అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచంలో నాటిన చెట్ల సంఖ్యను పేర్కోంది. ఈ పరిశోధన నివేదిక ప్రతిష్టాత్మక జర్నల్ నేచర్‌లో కూడా ప్రచురించబడింది.
నేచర్ మ్యాగజైన్లో ప్రచురించబడిన ఓ పరిశోధనా అధ్యయనం ప్రకారం.. ప్రపంచంలో 3.04 ట్రిలియన్ లేదా.. 34 ట్రిలియన్ లేదా 340000 కోట్ల చెట్లు ఉన్నాయి.
భూమిపై ఉన్న చెట్ల సంఖ్య ఇప్పుడు సగం మాత్రమే ఉందని పరిశోధనలో తెలీంది. గతంలో అడువులతో నిండిన యూరప్ ఇప్పుడు చాలా భూమిని వ్యవసాయం కోసం ఉపయోగిస్తుంది. అడవులను నరికి పొలాలుగా మారుస్తున్నాయి చాలా దేశాలు.
ఈ పరిశోధన ప్రకారం ప్రపంచంలో ప్రతి సంవత్సరం 1500 కోట్ల చెట్లు నరికేస్తున్నారు. వాటి స్థానంలో కేవలం 500 కోట్ల చెట్లు మాత్రమే నాటుతున్నారు. అంటే ఎక్కువ శాతం మొక్క నుంచి చెట్టుగా మారే తరుణంలో ఎన్నో చెట్లు నాశనమవుతున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం చాలా అడవులలో మంటలు వస్తున్నాయి.
దీంతో నరికేసిన.. కాలిపోయిన చెట్ల సంఖ్య కంటే.. కొత్తగా నాటే మొక్కల సంఖ్య చాలా తక్కువ. అడువులను నరికివేయడం, మంటలకు కాలిపోవడం వలన రోజు రోజుకీ చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది.. ఈ క్రమంలోనే పర్యావరణ వేత్తలు చెట్లను పెంచాలనే ప్రచారాన్ని వేగవంతం చేయాలని సిఫార్సు చేస్తున్నారు.
గత కొన్నేళ్లుగా భూమి ఉష్ణోగ్రత పెరుగుతున్న తీరు.. గ్లోబల్ వార్మింగ్ ప్రమాదం కూడా పెరుగుతోంది. కాలుష్యం పెరుగుతుంది. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశ ప్రభుత్వాలు చెట్లను పరిరక్షించేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నాయి.