
రాగులలో బి1, బి2, బి6, కె విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫొలేట్, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రాగులను క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

రాగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రాగులను క్రమంతప్పకుండా తీసుకోవటం వల్ల శరీరంలో పోషకాహార లోపం తీరుతుంది. ప్రమాదకరమైన వ్యాధులకు దూరం చేస్తుంది. రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి చక్కగా ఉపయోగపడతాయి. రాగులతో కండరాల నిర్మాణం సరిగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించడంలో రాగులు సమర్థవంతంగా పనిచేస్తాయి. గుండె సంబంధి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి రాగులు చాలా మంచిది. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు తక్కువగా ఉండి.. షుగర్ లెవల్స్ని కంట్రోల్లో ఉండేలా చేస్తాయి. కాబట్టి మధుమేహులకు ఇవి వరమని అంటున్నారు.

రక్తహీనతతో బాధపడేవారికి ఇది సరైన ఆహారం. చర్మం ముడతలు పడదు. ముఖానికి కాంతి వస్తుంది. జీర్ణ ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. అలాగే.. రాగులు క్రమం తప్పకుండా తింటే కావలసినంత క్యాల్షియం అందుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయని చెబుతున్నారు.

రాగులతో తయారు చేసిన రొట్టెలు ఎముకల సాంద్రతను పెంచి అవి బలంగా మారడానికి తోడ్పడతాయి. రాగి జావను తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే రాగుల్లో ఉండే పోషకాలు, ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ అందుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది.