
వీధి కుక్కలు పలు చోట్ల పాదచారులపై దాడులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. నిత్యం ఇలాంటి కేసులు వందల్లో వస్తున్నాయి. అయితే ఒక్కోసారి సైకిళ్లు, కార్లు , కదిలే వాహనాల వెనుక పరుగెత్తుతాయి. దీని వల్లన అనుకోని ప్రమాదాలు కూడా జరుగుతాయి.

ముఖ్యంగా బైక్‌పై వేగంగా ఏదో పనిపై వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా అరుస్తూ కుక్కలు వెంట పడుతుంటాయి. అందులో రాత్రిపూట బైక్‌లో ప్రయాణిస్తున్నప్పుడు కుక్కలు బైక్‌లను వెంబడిస్తుంటాయి. ఇలాంటి అనుభవం ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకసారి చవిచూసే ఉంటారు. ఇలాంటి పరిస్థితిలో బైక్‌ను మరింత వేగంగా నడిపి ప్రమాదాలకు గురైన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి.

ఇలాంటి సమయంలో కుక్కల నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా తెలియదు. కుక్కలు ఇలా వెంటపడటానికి చాలా కారణాలు ఉండవచ్చు. అయితే రాత్రిపూట బైక్ లేదా స్కూటర్‌పై వెళ్తున్నప్పుడు కుక్కలు వెంటపడకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీరు బైక్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ వేగంగా వెళ్లకూడదు. కుక్కలు కూర్చున్న ప్రదేశానికి సమీపంలో నెమ్మదిగా వెళ్లడం మంచిది. మీరు అధిక వేగంతో ఉన్నప్పటికీ వాటి సమీపంలోకి వెళ్లగానే బైక్ వేగాన్ని తగ్గించుకోవాలి.

నెమ్మదిగా వెళ్తున్నా కుక్కలు మిమ్మల్ని వెంబడించడానికి వస్తే.. ఒకసారి బైక్‌ను ఆపి, మళ్లీ నెమ్మదిగా అక్కడి నుంచి దూరంగా వెళ్లండి. బదులుగా ఈ సమయంలో బైక్‌ను వేగంగా నడిపితే మాత్రం కుక్కలు ఎక్కువగా వెంటాడతాయి. ఒకే చోటు రెండు కంటే ఎక్కవ కుక్కలు ఉంటే వాటి మధ్యలో నుంచి కాకుండా మరో పక్క నుంచి వెళ్లడం బెటర్.