
చైనాలో, ముఖ్యంగా దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో పాము మాంసంకి అధిక డిమాండ్ ఉంటుంది. పాము సూప్ ఇక్కడ చాలా ప్రాచుర్యం పొందిన శీతాకాలపు వంటకం. ఈ సూప్ శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుందని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని చైనీయుల నమ్మకం.

వియత్నాంలో పాము మాంసాన్ని రుచికరమైన ప్రత్యేక వంటకంగా పరిగణిస్తారు. ఇక్కడ పాము మాంసాన్ని వేయించి, కాల్చి సూప్‌లో ఉపయోగిస్తారు. అలాగే పాము రక్తాన్ని, దాని గుండెని 'రైస్ వైన్'తో కలిపి తాగడం ఈ దేశంలో చాలా గొప్ప క్రేజ్ గా భావిస్తారు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందట.

థాయిలాండ్‌లోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాము మాంసాన్ని తెగ తింటారు. దీనిని ప్రధానంగా పాము కూర లేదా 'స్టిర్-ఫ్రై' వంటకాలుగా తయారు చేస్తారు. విదేశీయులకు ఇది కొన్ని రెస్టారెంట్లలో కూడా అందుబాటులో ఉంటుంది.

ఇండోనేషియాలో పాము మాంసాన్ని ఆహారంగా, ఔషధంగా ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులు, ఉబ్బసం చికిత్సకు కోబ్రా (నాగుపాము) పాము మాంసం, దాని రక్తాన్ని ఉపయోగిస్తారు. జకార్తా వంటి నగరాల్లో పాము మాంసంతో కబాబ్‌లు తయారు చేసి అమ్ముతారు.

అమెరికాలోని దక్షిణ ప్రాంతంలో ముఖ్యంగా టెక్సాస్, ఫ్లోరిడాలో 'రాటిల్‌స్నేక్స్' తినే సంప్రదాయం ఉంది. ఇక్కడ చాలా ప్రదేశాలు 'రాటిల్‌స్నేక్ రౌండప్స్' అనే పండుగలను జరుపుకుంటాయి. ఇక్కడ పాము మాంసాన్ని వేయించి చిరుతిండిగా తింటారు.