
ప్రస్తుత కాలంలో ఫేస్ సీరమ్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో కూడా చాలా రకాలు వచ్చాయి. అనేక రకాలైన సీరమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పటికీ చాలా మందికి ఫేస్ సీరమ్స్ అంటే ఏంటి? వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలీదు. ఎలాంటి ఫేస్ ఉన్న వారికి.. ఏఏ సీరమ్స్ వాడాలో అవగాహన. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఫేస్ సీరమ్స్ ఉపయోగించడం వల్ల చర్మం హెల్దీగా, కాంతి వంతంగా తయారవుతుంది. అదే విధంగా పొడిబారకుండా హైడ్రేట్ అవుతుంది. దీంతో డల్ గా ఉన్న చర్మం కాస్తా మెరుస్తూ ఉంటుంది. సీరమ్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టం నుంచి కాపాడతాయి.

అంతే కాకుండా చర్మంపై ముడతలు, గీతలు, నల్లటి మచ్చలు, పిగ్మంటేషన్ ను తగ్గించడమే కాకుండా.. చర్మం అంతా ఒకే ఛాయ ఉండేలా చూస్తుంది. అందుకే చాలా మంది సీరమ్స్ యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే పింపుల్స్, వైట్ అండ్ బ్లాక్ హెడ్స్ వంటి వాటికి కూడా పరిష్కరాన్ని చూపిస్తాయి.

సాధారణమైన స్కిన్ ఉన్నవాళ్లు ఎటువంటి సీరమ్ ని అయినా వాడవచ్చు. పొడి చర్మం ఉన్న వారు.. గ్లిజరిన్, హైడ్రాలిక్ యాసిడ్ లెవల్స్ ఎక్కువగా ఉండేవి వాడాలి. జిడ్డు చర్మం ఉన్న వారు నియాసినమైడ్ ఉన్న సీరమ్స్ ఉపయోగించాలి.

మొటిమలు ఎక్కువగా ఉండేవారు సాల్సిలిక్ యాసిడ్ ఉన్న వాటిని ఎంచుకోవాలి. ఇది మొటిమల వాపుల్ని తగ్గిస్తుంది. అదే విధంగా ముడతలు, గీతలు ఎక్కువగా వచ్చిన వారు రెటీనాల్ సీరమ్, గ్లో చర్మం కావాలి అనుకున్న వారు విటమిన్ సి ఉన్న సీరమ్ ని ఉపయోగించడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి.