
వేయించిన వేరుశెనగలను చల్లని సాయంత్రం కాసిన్ని తింటే.. ఆ మజానే వేరు. వర్షం కురిసే సమయంలో ఉడికించిన పల్లీలు తింటే భలేగా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరికీ తమదైన శైలిలో వేరుశనగలు తినే అలవాటు ఉంటుంది. అందుకే చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడతారు.

వేరుశనగలు పోషకాలు, ఖనిజాల నిధి. అయితే వేరుశెనగ తినడానికి సరైన పద్ధతి ఏమిటి? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిపుణుల ప్రకారం.. 100 గ్రాముల ముడి వేరుశెనగ గింజల్లో 567 కేలరీలు, 6.5% నీరు, 25.8 గ్రాముల ప్రోటీన్, 16.1 కార్బోహైడ్రేట్లు, 4.7 చక్కెరలు, 8.5 ఫైబర్, 15.56 గ్రాముల ఒమేగా-6తో పాటు బయోటిన్, కాపర్, నియాసిన్, ఫోలేట్, మాంగనీస్, విటమిన్ E, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు, పోషకాలు ఉంటాయి.

అయితే చాలా మంది వేరుశెనగ గింజలు రుచిగా ఉండటం వల్ల ఎక్కువగా తింటుంటారు. కానీ దీనివల్ల హాని కలుగుతుంది. కాబట్టి వీటిని పరిమిత పరిమాణంలో, సరైన మార్గంలో తీసుకోవాలి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. వేరుశనగ గింజలు పరిమిత పరిమాణంలో తింటే ప్రోటీన్‌లు అందుతాయి. ఒక రోజులో ఎక్కువ వేరుశనగ గింజలు తింటే జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. ఆమ్లత్వం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

వేరుశనగ కాయలను నానబెట్టి తినాలి. ముఖ్యంగా చలికాలంలో 20 నుండి 25 వేరుశనగ కాయలను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వీటిని తినవచ్చు. వేరుశనగ కాయలను తినడానికి ఇది సరైన మార్గం.

వేరుశనగ పప్పుల్లో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. వేరుశనగ పప్పులను సుగంధ ద్రవ్యాలతో కలిపి తినకూడదు. మీకు ఈ గింజలకు సంబంధించిన ఏవైనా అలెర్జీలు, ఆరోగ్య సమస్యలు ఉంటే నిపుణుడిని సంప్రదించవచ్చు.