
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల కొందరు విపరీతమైన అసౌకర్యానికి గురవుతుంటారు. యూరిక్ యాసిడ్ కంట్రోల్ చేయడానికి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే కొన్ని రకాల పండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే ఈ పండ్లను రెగ్యులర్ గా తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..

పుచ్చకాయలో సిట్రులిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి.

పైనాపిల్‌లో వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో బ్రోమెలైన్ అనే ఉద్దీపనం ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలో యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఏర్పడినప్పుడు గౌట్ నొప్పి మొదలవుతుంది. దీని నుంచి ఉపశమనం పొందాలంటే నారింజలు అధికంగా తినాలి. ఇవి యూరిక్ యాసిడ్ స్ఫటికాలుగా ఏర్పడకుండా నిరోధిస్తాయి.

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ యాపిల్స్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. యూరిక్ యాసిడ్ నివారణకు కూడా ఇది చాలా మంచిది. కివీ పండుతో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. యూరిక్ యాసిడ్‌తో పోరాడడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

బ్లూబెర్రీ ఒక చిన్న పండు. ఈ పండులో చాలా సుగుణాలు ఉన్నాయి. ఇందులోని ఆంథోసైనిన్లు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహకరిస్తాయి. చెర్రీ పండ్లు కూడా యూరిక్ యాసిడ్‌కు వ్యతిరేకంగా పోరాడగలవు. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండే ఈ పండు యూరిక్ యాసిడ్ నొప్పిని తగ్గిస్తుంది.