
ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో బుధవారం భారీ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి డెనిస్ మొనాస్టిర్స్కీ సహా 18 మంది మరణించారు.

కైవ్‌లోని కిండర్ గార్డెన్ స్కూల్ సమీపంలో ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. చనిపోయినవారిలో చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు. కీవ్‌లోని తూర్పు శివారు ప్రాంతమైన బ్రోవరీలో జరిగిన ప్రమాదంలో 10 మందికి పైగా చిన్నారులు గాయపడ్డారు. వారంతా ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.

ఈ హెలికాప్టర్ అత్యవసర సేవకు చెందినది. నివాస భవనం సమీపంలో కూలిపోయింది. హెలికాప్టర్ కూలిపోవడంతో అందులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది చిన్నారులు సహా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.

హెలికాప్టర్‌లో ఉన్న మొత్తం 9 మంది మరణించారు. ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి డెనిస్ మొనాస్టిర్స్కీతో పాటు మరో ఇద్దరు మంత్రులు మరణించారు. డిప్యూటీ మంత్రి యెవెన్ యెనిన్, రాష్ట్ర కార్యదర్శి యురా లుబ్కోవిచ్ కూడా మరణించారు.

అంతర్గత వ్యవహారాల మంత్రి డెనిస్ మొనాస్టిర్స్కీకి 42 సంవత్సరాలు. అతను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీకి చాలా సన్నిహిత వ్యక్తి. అతని మంత్రివర్గంలో కీలక సభ్యుడు. అతను రష్యా -ఉక్రెయిన్ యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.

అతను రష్యా క్షిపణి దాడుల వల్ల సంభవించే మృతుల కుటుంబాలను, గాయపడిన ప్రజలు ఎప్పటికప్పుడు స్వయంగా కలిసి పరామర్శించేవాడు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం 24 ఫిబ్రవరి 2022 నుండి ప్రారంభమైంది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది.