
పల్లీలు, టమోటాల కమ్మదనంతో పాటు దోసకాయ ముక్కలు అక్కడక్కడ పంటికి తగులుతుంటే వచ్చే రుచే వేరు. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి, ఈ దోసకాయ పచ్చడి కలుపుకుని తింటే అమృతంలా ఉంటుంది.

ఈ పచ్చడి తయారీ కోసం ముందుగా పచ్చిగా ఉన్న నాటు దోసకాయను ఎంచుకోవాలి. పీలర్‌తో తొక్క తీసి, చిన్న ముక్కగా కట్ చేసి చేదు ఉందో లేదో సరిచూసుకోవాలి. చేదు లేకపోతే విత్తనాలు తొలగించి (కావాలంటే విత్తనాలతో సహా) దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు బాండీలో మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్‌పై ఎర్రగా వేయించి పొట్టు తీయాలి. అదే బాండీలో నూనె వేసి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి దోరగా వేయించి తీయాలి. ఆపై రెండు పండిన టమోటా ముక్కలు, కొద్దిగా చింతపండు వేసి టమోటాలు మెత్తబడే వరకు మగ్గించి చల్లారనివ్వాలి.

మిక్సీ జార్‌లో లేదా రోట్లో వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. అందులోనే మగ్గించిన టమోటా గుజ్జు మరియు కొన్ని దోసకాయ ముక్కలు వేసి లైట్‌గా పల్స్ చేస్తూ గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా పేస్ట్‌లా చేయకుండా పలుకుగా ఉంచాలి. ఈ రుబ్బిన పచ్చడిని మిగిలిన పచ్చి దోసకాయ ముక్కలు ఉన్న గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి.

చివరగా బాండీలో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసి, తాలింపును దోసకాయ పచ్చడిలో కలిపితే కమ్మటి దోసకాయ ముక్కల పచ్చడి సిద్ధమవుతుంది. బ్యాచిలర్స్ కూడా ఎంతో సులభంగా చేసుకునే ఈ పచ్చడిని మీ ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి.