
Telangana Assembly Election 2023: ఎన్నికల కోడ్ వచ్చిందో లేదో అప్పుడే ఈసీ తన పని మొదలుపెట్టింది. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న వారిపైన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో అక్రమంగా తరలిస్తున్న డబ్బు, బంగారం, వెండి, మద్యం ఇలా విలువైన వస్తువులకు సంబంధించి లెక్కా పత్రం లేకపోతే వెంటనే సీజ్ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి మూడు రోజులు కావస్తోంది. ఈ మూడు రోజుల్లోనే దాదాపు 20 కోట్ల డబ్బులనును పోలీసు అధికారులు సీజ్ చేశారు.

అక్టోబర్ 11 వ తారీఖు ఒక్కరోజే ఆరు కోట్ల 20 ఏడు లక్షల రూపాయలను ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా సీజ్ చేసింది. అయితే ఎన్నికల కోడ్ అమలవుతున్న అక్టోబర్ 9 నుండి అక్టోబర్ 12 ఉదయం వరకు దాదాపు 20 కోట్ల 43 లక్షల రూపాయలను సీజ్ చేశారు. అన్ని చెక్‌పోస్టుల దగ్గర అధికారులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి.. సరైన దృవీకరణ పత్రాలు లేని నగదును స్వాధీనం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అదే మద్యం విలువ చూస్తే మాత్రం నోరెళ్లపెట్టాల్సిందే. ఎన్నికల కోడ్ అమలవుతున్న అక్టోబర్ 9 నుంచి ఈరోజు ఉదయం వరకు 86 లక్షల 92,000 విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే 31 వేల 730 లీటర్ల మద్యం తనిఖీల్లో పట్టుబడింది. నిన్న ఒక్కరోజే 19317 లీటర్ల మద్యం పట్టుబడగా.. దాని విలువ 31 లక్షల 36వేల రూపాయలుగా అధికారులు తెలిపారు.

ఎన్నికల కోడ్ అమలు అవుతున్న తెలంగాణ రాష్ట్రంలో 258 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో డబ్బు మద్యం కాకుండా బంగారు ఆభరణాలు కూడా సీజ్ చేస్తున్నారు. కోడ్ అమలవుతున్న అక్టోబర్ 9 నుండి ఇప్పటివరకు 14 కోట్ల 65 లక్షల 50వేల 852 రూపాయల విలువగల బంగారం, వెండి, వజ్రాలను సీజ్ చేశారు.

మత్తు పదార్థాలు కూడా ఈ తరీక్షల్లో బయటపడుతున్నాయి ఇప్పటివరకు 89 లక్షల 2వేల రూపాయల విలువగల మత్తుపదార్థాలను అధికారులు సీజ్ చేశారు. తనిఖీల్లో లాప్టాప్‌లు, వాహనాలు ఇతర వంట సామాగ్రి, స్పోర్ట్స్ థింగ్స్, చీరలు కూడా సీజ్ చేశారు. వాటి విలువ 22 లక్షలకు పైగానే ఉంటుంది. మూడు రోజుల్లోనే ఇంత పట్టుబడితే ఎన్నికల అయ్యేవరకు ఇంకెంత పట్టు పడుతుందోనని చర్చనీయాంశంగా మారింది.