
ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతీ దానికి టెక్నాలజీని వినియోగిస్తున్నారు ప్రజలు. ఇక ఆన్‌లైన్ షాపింగ్ గురించి అయితే చెప్పనవసరం లేదు. ప్రతీ చిన్నదానికి ఆన్‌లైన్ షాపింగ్‌నే ఆశ్రయిస్తున్నారు.

అయితే కొన్నిసార్లు ఆన్‌లైన్ షాపింగ్ చేసి మోసపోయిన వారు చాలా మందే ఉన్నారు. మరికొన్నిసార్లు తమకు కావాల్సింది ఒకటి ఆర్డర్ చేస్తే.. మరొకటి వచ్చిన సందర్భాలు కోకొల్లలు అనే చెప్పాలి.

తాజాగా ఇలాంటి ఘటనే ముంబైలో వెలుగు చూసింది. ఆన్‌లైన్ షాపింగ్ చేసిన లోకేష్ అనే వ్యక్తికి ఊహించని రీతిలో వేరే వస్తువు వచ్చింది. అది చూసి షాక్ అవడం అతని వంతు అయ్యింది.

ముంబైకి చెందిన లోకేష్ అమెజాన్ యాప్ ద్వారా కోల్గేట్ మౌత్ వాష్ ఆర్డర్ చేశాడు. అయితే, అతనికి మౌత్ వాష్‌కు బదులుగా రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్ ఫోన్‌ను డెలివరీ చేశారు అమెజాన్ డెలివరీ వాళ్లు.

తనకు వచ్చిన డెలివరీ ప్యాక్‌ను విప్పి చూడగా.. అందులో రెడ్‌మీ నోట్ 10 మొబైల్ ఉండటం చూసి షాక్ అయ్యాడు. అయితే అప్పటికే డెలివరీ బాయ్ వెళ్లిపోయాడు.

హలో అమెజాన్.. నేను కోల్గేట్ మౌత్‌వాష్‌ను ఆర్డర్ చేశాను. దానికి బదులుగా రెడ్‌మీ నోట్ 10 మొబైల్ వచ్చింది. మౌత్ వాష్ నిత్యావసర వస్తువు కాబట్టి యాప్ ద్వారా రిటర్న్ చేయడానికి అవకాశం లేదు. ప్యాకేజీని ఓపెన్ చేసినప్పుడు ప్యాకేజింగ్ లేబుల్ మాత్రం నాపేరు మీదే ఉంది. కానీ, ఇన్‌వాయిస్ వేరొకరిది. ఫోన్ ఆర్డర్ చేసిన వారికి ఈ ప్రొడక్ట్‌ను నా దగ్గర నుంచి తీసుకొని సరైన వ్యక్తికి అందించండి అని లోకేష్ ట్వీట్ చేశాడు.