Raju M P R | Edited By: Shaik Madar Saheb
Oct 11, 2024 | 12:42 PM
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం మహా రథోత్సవాన్ని నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో విహరించారు. గోవింద నామస్మరణతో భక్తులు రథాన్ని లాగారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంతో.. గోవిందానామస్మరణ చేశారు.
అయితే, అలంకార ప్రియుడు శ్రీ వేంకటేశ్వరుడి వద్ద అలంకరణలది పెద్ద పీటే. ఇక శ్రీహరి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అయితే అది మరింతగా భక్తులను ఆకట్టుకునేలా ఉంటుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులను ఆకట్టుకునేలా టిటిడి తిరుమలను ముస్తాబు చేస్తుంది.
ఫల పుష్ప అలంకరణలతో విద్యుత్ దీప అలంకరణలతో దేదీప్యమానంగా తిరుమల వైకుంఠం లా దర్శనం ఇస్తుంది. శ్రీవారి ఆలయం లోపల బయట ఇదే వాతావరణం ఉంటుంది. ఇక శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడుసార్లు పుష్ప ప్రదర్శనను మార్చుకున్న టీటీడీ నిన్న ఆలయం లోపల ఫలపుష్ప ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా చేసింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఆలయ పుష్పాలంకరణకు పుష్పాలను విరాళం అందజేశారు.
బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి ఆలయానికి చేపట్టిన మూడో విడత పుష్పాలంకరణకు రూ. 15 లక్షల విలువైన పుష్పాలను అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులకు ఈ విరాళాన్ని అందజేశారు.
బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు 10 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 60 వేల కట్ ఫ్లవర్స్ తో పుష్పాలంకరణ జరగ్గా ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠం, ఆలయ ప్రాంగణాలకు పుష్పాలంకరణ చేసేందుకు ఫ్లవర్స్ ను అందజేశారు మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్.