
గ్రామీణ తెలంగాణలో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి SPMCIL (సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) రోహిణి ఫౌండేషన్‌కు మొబైల్ డెంటల్ వ్యాన్‌ను విరాళంగా అందించింది.

సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తన కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీలో భాగంగా రోహిణి ఫౌండేషన్‌కు మొబైల్ డెంటల్ వ్యాన్‌ను సమకూర్చింది.

ఈ వ్యాన్‌ను SPMCIL చైర్మన్ అండ్ CMD విజయ్ రంజన్ సింగ్ ప్రారంభించారు. శ్రీపాద వాజ్‌పే (చీఫ్ జనరల్ మేనేజర్), దుర్గా ప్రసాద్ ఆచంట(AGM), మెహుల్ రాథోడ్ (DGM), రోహిణి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సంపత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సైఫాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. పేద వర్గాలకు, ముఖ్యంగా గ్రామీణ తెలంగాణలోని పిల్లలకు ఉచిత దంత పరీక్షలు, నోటి క్యాన్సర్ స్క్రీనింగ్‌లు నివారణ సంరక్షణను అందించడానికి ఈ అత్యాధునిక మొబైల్ డెంటల్ యూనిట్ రోహిణి ఫౌండేషన్‌కు ఉపయోగపడనుంది.

ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ రెడ్డి మాట్లాడుతూ.. "ఈ వ్యాన్ మారుమూల ప్రాంతాలకు చేరుకోవడానికి, చాలా అవసరమైన దంత సంరక్షణను అందించడానికి మాకు సహాయపడుతుంది" అని అన్నారు.