
వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు తన మిత్ర క్షేత్రాలైన మకర, కుంభ రాశుల్లో సంచారం చేయడం వల్ల షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. సగటు వ్యక్తి సైతం సంపన్నుడు కావడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కుతారు. వ్యాపారాల్లో జోరు పెరుగుతుంది.

మిథునం: రాశ్యధిపతి బుధుడు మిత్ర క్షేత్రాలైన మకర, కుంభ రాశుల్లో సంచారం చేయడం, దాన్ని గురువు పూర్ణ దృష్టితో వీక్షించడం వల్ల రావలసిన సొమ్ము చేతికి అందడంతో పాటు, అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను దాటుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెంది, పలుకుబడి పెరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.

కన్య: రాశ్యధిపతి బుధుడు మకర, కుంభ రాశుల్లో సంచారం చేయడం, దాన్నిగురువు వీక్షించడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఆస్తిపాస్తుల ద్వారా కూడా అంచనాలకు మించిన ఆదాయం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

తుల: రాశ్యధిపతి శుక్రుడికి మకర, కుంభ రాశులు యోగదాయక స్థానాలు. ఈ రాశుల్లో సంచారం చేస్తున్నంత కాలం శుక్రుడి వల్ల ఆర్థిక లాభాలు కలుగుతూనే ఉంటాయి. ఇక్కడ బుధ, శుక్ర గ్రహాల యుతి వల్ల మహా భాగ్యయోగాలు కలగడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని దాటుతాయి.

మకరం: ఈ రాశిలో ఈ రాశికి అత్యంత శుభ గ్రహాలైన బుధ, శుక్రుల సంచారం వల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఈ రెండు శుభ గ్రహాలను గురువు చూడడం వల్ల ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం ఉంది. జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఊహించని స్పందన లభిస్తుంది. నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగం సంపాదించే అవకాశం కూడా ఉంది. పిత్రార్జితం బాగా కలిసి వస్తుంది.

కుంభం: ఈ రాశిలో మూడు రెండు నెలల పాటు బుధ, శుక్రుల సంచారం, వాటిని గురువు పంచమ స్థానం నుంచి వీక్షించడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.