- Telugu News Photo Gallery Spiritual photos The Myths and Mysteries of Patal Bhuvaneshwar cave temple uttarakhand in India
Patal Bhuvaneshwar: ఎన్నో రహస్యాలకు నిలయం పాతాళ భువనేశ్వర్ గుహాలయం.. ఇక్కడనుంచి పాండవులు కైలాసానికి వెళ్లారట..
Patal Bhuvaneshwar: భారత ఆధ్యాత్మక దేశం. ప్రకృతి అందాల నడుమ కొండ, కోనల్లో ఎందరో దేవుళ్ళు స్వయంభువులుగా వెలిశారు. ఇక ఎన్నో ఆలయాలు గుహల్లో ఉన్నాయి. అలాంటి గుహాలయాల్లో ఒకటి పాతాళ భువనేశ్వర్. ఈ గుహాలయం ఎన్నో రహస్యాలకు ఎన్నో అద్భుతాలకు నిలయమైన పాతాళ భువనేశ్వర్ గురించి తెలుసుకుందాం.
Updated on: Sep 13, 2021 | 12:23 PM

ఉత్తరాఖండ్ లోని భువనేశ్వర్ అనే గ్రామంలో పాతాళ భువనేశ్వర్ అనే గుహ ఉంది. ఈ గుహని చేరుకోవడానికి సుమారు 3 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. చాలా ఇరుకుగా ఉండే ఈ గుహలోకి వెళ్లాలంటే రెండు పక్కల ఉండే గొలుసులను పట్టుకుంటూ సుమారు 90 అడుగుల లోతుకు దిగాల్సి ఉంటుంది.

తన భార్య దమయంతి చేతిలో ఓడిపోయి నలుడు అరణ్యంలో సంచరిస్తూ అలసిపోయి.. ఓ చెట్టుకింద సేదదీరుతున్న సమయంలో ఒక జింక కనిపిస్తుంది. అప్పుడు ఆ జింకను వేటాడాలని భావించిన నలుడిని జింక నన్ను వేటాడకు అంటూ వేడుకుంది.

తన చేతినుంచి ప్రాణాలు దక్కించుకున్న జింక వెళ్తున్న వైపు నలుడు చూస్తుండగా..ఆ జింక పాతాళ గుహవైపు వెళ్ళింది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఆ జింక అంతర్ధానమయ్యింది. దీంతో నలుడు అక్కడ స్థలానికి ఏదో ప్రత్యేకత ఉందని గ్రహించి చూడగా నలుడికి పాతాళ భువనేశ్వర్ గుహ కనిపించిందని స్థల పురాణ కథనం

ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఈ గుహలలో త్రిమూర్తులు, వేయి పడగల శేషుడు, శివుడి జటాజూటం, ఐరావతం, కల్పవృక్షం, 33 కోట్ల దేవతల ఆకారాలు దర్శనమిస్తారు.

అంతేకాదు శివుడు నరికిన వినాయకుడి శిరస్సు ఈ గుహంలోనే ఉందని మరో కథనం. శివుడు వినాయకుని తలని నరకగా ఏనుగు మొండాన్ని తెచ్చేంతవరకు ఈ గుహలోనే వినాయకుని మొండాన్ని ఉంచారని దానికి గుర్తుగానే ఇక్కడ ఒక శిలారూపాన్ని వదిలిపెట్టారని పురాణం

కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత పాండవులు ఈ గుహకి వచ్చి తపస్సు చేసి ఇక్కడ ఉన్న గుప్త ద్వారం గుండా కైలాసానికి వెళ్లారని భక్తుల నమ్మకం

శివుడి జటాజూటంగా ఉండే ఈ గుహలో మొత్తం పాపద్వారము, రణద్వారము, మోక్షద్వారము, ధర్మ ద్వారము అనే నాలుగు గుహలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు గుహాద్వారాలు మాత్రమే తెరచి ఉన్నవి. ఇక్కడి నుండి కైలాసపర్వతానికి గుప్తమార్గం ఉన్నదని స్థానికుల నమ్మకం.. ఎన్నో అద్భుతాలకు నిలయమైన పాతాళ భువనేశ్వర్ గుహ దర్శనం ఆధ్యాత్మిక భక్తులకు , ప్రకృతి ప్రేమికులకు మంచి అనుభూతినిస్తుంది




