- Telugu News Photo Gallery Spiritual photos Statue Of Equality: Home Minister Amit Shah Visits Sri Ramanujacharya Statue At Chinnajeeyar Swamy Ashram In muchintal hyderabad
Statue Of Equality: వైభవంగా రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు.. అమిత్ షా సందర్శన ఫొటోలు
Statue Of Equality: హైదరాబాద్ ముచ్చింతల్‌లోని శ్రీ రామనగరాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మంగళవారం సందర్శించారు. రామానుజాచార్యుల విగ్రహం దగ్గర టికెట్ కౌంటర్‌ను, థియేటర్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. శ్రీరామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. బద్రవేదిలోని శ్రీ రామానుజచార్యుల జీవితచరిత్రకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. త్రీడీ లేజర్ షోను వీక్షించారు. 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు.
Updated on: Feb 09, 2022 | 12:03 AM

ఈ సందర్భంగా అమిత్ షాకు.. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు ఆలయ విశేషాలను, సమతామూర్తి ప్రాంగణ విశేషాలను దగ్గరుండి వివరించారు. రాత్రి యాగశాలలో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువులో భాగంగా నిత్య పూర్ణాహుతిలో అమిత్‌షా పాల్గొన్నారు. ప్రధాన యాగశాలలో పూజలు చేశారు. అనంతరం అమిత్‌షాను త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ సన్మానించి మంగళాశాసనాలు అందించారు.

శ్రీరామనగరం పర్యటన కొత్త అనుభవాన్ని ఇచ్చిందన్నారు కేంద్రహోంమంత్రి అమిత్ షా. భాగ్యనగరానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సమతామూర్తి దర్శనంతో ఆత్మానందం కలిగిందన్నారు. సమతామూర్తి విగ్రహం ప్రపంచానికి ఏకతా సందేశం ఇస్తోందని అమిత్ షా తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషిచేస్తోన్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామిజీని అమిత్ షా అభినందించారు. చిన్నజీయర్ స్వామీజీ చేపట్టిన ఈ కార్యక్రమం వేల ఏళ్లు నిలిచిపోతుందదన్నారు.

రామానుజాచార్యుల బోధనలు అన్నివర్గాలకు ఆదర్శమని అమిత్ షా పేర్కొన్నారు. రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్నిసూచిస్తూ.. దేశంలో ఐక్యతను సాధించేందుకు కృషిచేశారని అమిత్ షా తెలిపారు. సర్వస్వం భగవంతునికి సమర్పించిన వారందరికీ మోక్షం పొందే హక్కు ఉందని రామానుజాచార్యులు బోధించారన్నారు. సమతామూర్తి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని కేంద్రహోంమంత్రి అమిత్ షా కొనియాడారు.

దేశంలోని అన్నిభాషల్లో సమతామూర్తి సందేశాలను అందించాలని అమిత్ షా కోరారు. రామానుజాచార్యులు రాసిన శ్రీ భాష్యం, వేదాంత సంగ్రహం సహ తొమ్మిది గ్రంథాలు అత్యంత ఆదరణ పొందాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు.

అందరికీ ప్రేరణనిచ్చేలా అమిత్ షా ప్రసంగించారని.. కేంద్రహోంమంత్రి అమిత్ షా ముచ్చింతల్ రావడం గొప్ప విషయమని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ, మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు పేర్కొన్నారు.
