- Telugu News Photo Gallery Spiritual photos Srivari Navaratri Brahmotsavam 3rd day: Simha Vahanam today in Tirumala Tirupati
Tirupati: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఈ రోజు ఉదయం సింహవాహనంపై మలయప్పస్వామి దర్శనం..
తిరుమల తిరుపతి క్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అశేష భక్త వాహిని మధ్య స్వామివారి రోజుకో అలంకారంలో ఒకొక్క వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. నేడు బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు. ఈ రోజు ఉదయం 8 గంటలకు వెంకటాచలపతి సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Updated on: Oct 17, 2023 | 7:03 AM

ఈ రోజు రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీదేవి, భూదేవితో కలిసి కాళీయమర్ధన అలంకారంలో స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం చేసుకుంటే తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకురుస్తుందని విశ్వాసం

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం రాత్రి శ్రీమలయప్పస్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను అలరించాయి.

హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. పురాణాల ప్రకారం బ్రహ్మ వాహనం హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ హంస స్వభావం..

ఇది ఆత్మ వివేకానికి సూచన. ఈ వాహన సేవను దర్శించిన భక్తుల్లో అహంభావాన్ని తొలగించి జ్ఞానం కలుగుతుందని, బ్రహ్మపద ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు శంఖుచక్రాలతో యోగముద్రలో బద్రీనారాయణ అలంకారంలో ఐదు తలల చిన్న శేషవాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.

పురాణాల ప్రకారం చిన్నశేషుడు అంటే వాసుకి.. నాగలోకానికి రాజు. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

ఈ వాహన సేవలో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహకిషోర్ తదితరులు పాల్గొన్నారు.




