
మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్ర, కేతువుల సంచారం వల్ల తప్పుడు నిర్ణయాలు, తొందరపాటు చర్యలతో కుటుంబ జీవితం ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. పిల్లల వల్ల సమస్యలు కలుగుతాయి. అనవసర పరిచయాల మీద ఖర్చులు పెరుగుతాయి. నష్టదాయక వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామితో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఉద్యోగంలో పొరపాట్లు జరిగే సూచనలున్నాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

వృషభం: రాశ్యధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో కేతువుతో కలవడం వల్ల సుఖ నాశనం కలుగుతుంది. శృంగార జీవితం మీద ఆసక్తి సన్నగిలుతుంది. కుటుంబంలో ఎవరో ఒకరిని అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. అనవసర ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కొందరు దగ్గర బంధువుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యత తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా పురోగమిస్తాయి. ఆస్తి వివాదాలు మరింత జటిలంగా మారుతాయి. వ్యయ ప్రయాసలు పెరుగుతాయి.

కర్కాటకం: ఈ రాశికి కుటుంబ స్థానంలో శుక్ర కేతువుల యుతి వల్ల కుటుంబంలో కలతలు తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వాదోపవాదాలకు అవకాశముంది. కొందరు బంధుమిత్రుల వల్ల, ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో పొరపాట్ల వల్ల ధన నష్టం జరిగే సూచనలున్నాయి. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా ఇబ్బందులు పడడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు లేదా పిల్లల వల్ల సమస్యలు మొదలవుతాయి. ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు బాగా చికాకు పెడతాయి.

సింహం: ఈ రాశిలో శుక్ర కేతువులు యుతి చెందడం వల్ల అటు కుటుంబ జీవితం, ఇటు దాంపత్య జీవితం సుఖప్రదంగా సాగే అవకాశం ఉండదు. తరచూ అనారోగ్యాలకు గురికావడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో అకారణ విభేదాలు తలెత్తుతాయి. పెళ్లి సంబంధాలు చివరి క్షణంలో వాయిదా పడడమో, రద్దు కావడమో జరుగుతుంది. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. మాట తొందర వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల బంధువుల్లో ఇబ్బందులు తలెత్తడం జరుగుతుంది.

మకరం: ఈ రాశికి అష్టమ స్థానంలో శుక్ర కేతువుల సంచారం వల్ల దాంపత్య జీవితంలో అశాంతికి, అసంతృప్తికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామికి దూర ప్రాంతానికి బదిలీ కావడమో, జీవిత భాగ స్వామి అనారోగ్యానికి గురికావడమో జరుగుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఏ పనీ, ఏ ప్రయత్నమూ సవ్యంగా సాగకపోవచ్చు. ప్రతి విషయంలోనూ వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సహాయానికి బాగా ఒత్తిడి ఉండవచ్చు.

మీనం: ఈ రాశికి షష్ట స్థానంలో శుకుడు కేతువుతో కలవడం వల్ల కుటుంబ సమస్యలు తలెత్తుతాయి. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల జోక్యం ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల కారణంగా జీవిత భాగ స్వామితో తరచూ వాదోపవాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. విహార యాత్రల్లో ఆటంకాలు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ, లాభం తక్కువగా ఉంటుంది.