
మేషం: శని వ్యయ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఏర్పడిన ఏలిన్నాటి శని దోషం లాభ స్థానంలో ఉన్న రాహువు వల్ల పరిహారం అవుతుంది. ఇక 5, 11 స్థానాల్లో ఉన్న రాహు కేతువుల వల్ల ధన ధాన్య సమృద్ధికి అవకాశం ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందు తుంది. ప్రముఖు లతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.

మిథునం: ఈ రాశివారికి భాగ్య, తృతీయ స్థానాల్లో ఉన్న రాహుకేతువులు స్వతంత్ర ఫలితాలనివ్వడం వల్ల విదేశీ సంబంధమైన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు అనుకూలిస్తాయి. విదేశీ సంపాదన అనుభవించే యోగం కలుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. వృత్తి, వ్యాపారాలు కొద్ది మార్పులతో అభివృద్ధి బాటపడతాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి.

సింహం: ఈ రాశి ఉన్న కేతువు, సప్తమ స్థానంలో ఉన్న రాహువు స్వతంత్రంగా వ్యవహరించడం వల్ల ఇంటా బయటా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో భారీగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అపారమైన లాభాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు.

కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలో రాహువు, వ్యయ స్థానంలో కేతువు సంచారం వల్ల కొన్ని ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలతో పాటు న్యాయపరమైన చిక్కులు, కేసులు కూడా పరిష్కారమవుతాయి. ఆస్తి సమస్యల నుంచి గట్టెక్కుతారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది.

ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో రాహువు, భాగ్య స్థానంలో కేతువు సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం కూడా చాలావరకు తొలగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ది చెందుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు అనేక కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

మకరం: ఈ రాశికి ధన స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో కేతువు స్వతంత్రంగా వ్యవహరించడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆస్తి పాస్తులు కొనడం జరుగుతుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.