
వృషభం: ఓర్పు, సహనాలతో పాటు దూరదృష్టి, ప్రణాళిక కలిగి ఉండే ఈ రాశుల వారికి గురు బలం, శని బలం తోడవుతుండడం వల్ల కొత్త సంవత్సరంలో వీరు ఉద్యోగాల కోసం ప్రయత్నించే బదులు వ్యాపారాలు ప్రారంభించడం వల్ల ఉపయోగం ఉంటుంది. కొద్ది శ్రమతో ఇబ్బడిముబ్బడిగా లాభాలు కలిగే అవకాశం ఉంది. చిన్న వ్యాపారమైనా, తక్కువ పెట్టుబడి అయినా వీరికి బాగా కలిసి వస్తుంది. ఇంట్లో కూర్చుని చేసే వ్యాపారాలు బాగా లాభిస్తాయి. షేర్ల వల్ల కూడా లాభాలు కలుగుతాయి.

మిథునం: ఈ రాశివారు తమలో అంతర్గతంగా ఉన్న వ్యాపార నైపుణ్యాలను ఉపయోగించుకోవడం మంచిది. ధన కారకుడు గురువు జూన్ వరకు ఇదే రాశిలోనూ, ఆ తర్వాత ధన స్థానంలో ఉచ్ఛ స్థితిలోనూ సంచారం చేయడం వల్ల ఈ రాశివారు వీలైనంతగా త్వరగా వ్యాపార రంగంలో ప్రవేశించడం మంచిది. వీరికి ఉద్యోగాల కన్నా వ్యాపారాలే బాగా కలిసి వస్తాయి. ప్రయాణాలు, పర్యటనలకు సంబంధించిన వ్యాపారాల వల్ల లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు కూడా బాగా లాభిస్తాయి.

కన్య: ఆర్థిక క్రమశిక్షణ, అందరినీ కలుపుకునిపోయే తత్వం, ఓర్పు, సహనాలు కలిగిన ఈ రాశివారు ఉద్యోగ ప్రయత్నాల కంటే వ్యాపార ప్రయత్నాలు చేపట్టడం చాలా మంచిది. కొత్త సంవత్సరంలో వీరికి లాభ స్థానంలో ధన కారకుడు గురువు ఉచ్ఛ స్థితికి రావడం వల్ల వీరు వ్యాపారంలో అంచ నాలకు మించి లాభాలు సంపాదించే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, డీలర్షిప్, కన్సల్టెన్సీ, ఏజెన్సీ, భాగస్వామ్య వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. షేర్లు, స్టాకులు కూడా వీరికి బాగా లాభిస్తాయి.

తుల: వ్యాపార తత్వం కలిగిన ఈ రాశివారు ఉద్యోగం కోసం ప్రయత్నించకపోవడం మంచిది. తమలోని నైపుణ్యాలను, ప్రతిభా పాటవాలను వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టడం వల్ల వీరు బాగా లబ్ధి పొందే అవకాశం ఉంది. భాగ్య స్థానంలో గురువు సంచారం మే వరకూ కొనసాగుతున్నందువల్ల వ్యాపా రాలు ప్రారంభించడానికి, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రయాణాల మీద ఆధారపడ్డ వ్యాపారాలు వీరికి బాగా లాభాలను తీసుకువచ్చే అవకాశం ఉంది.

ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో రాశ్యధిపతి గురువు సంచారం చేస్తున్నందువల్ల మే లోపు ఈ రాశి వారు వ్యాపారాలు ప్రారంభించడం, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం, షేర్లు, స్పెక్యులేషన్లలో మదుపులు చేయడం వంటి ప్రయత్నాలు అంచనాలను మించి లాభించే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో కంటే వ్యాపారాల ద్వారానే వీరు ఎక్కువగా సంపాదించే అవకాశం ఉంది. ఉన్నత స్థానాలకు ఎదగాలన్న వీరి ఆకాంక్షలు, ఆశయాలు వ్యాపారాల ద్వారానే సిద్ధించే అవకాశం ఉంది.

మకరం: ఒక ప్రణాళిక ప్రకారం లేదా వ్యూహం ప్రకారం నడుచుకోవడం, ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండడం, ఓర్పు, సహనాలు ఎక్కువగా ఉండడం వంటి లక్షణాలను కలిగిన ఈ రాశివారు ఉద్యోగంలో కంటే వ్యాపారాల్లోనే బాగా రాణించే అవకాశం ఉంది. వ్యాపారపరంగా వీరి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ రాశికి సప్తమ స్థానంలో ధనకారకుడు గురువు ఉచ్ఛపడుతున్నందువల్ల మే తర్వాత వీరికి వ్యాపార రంగంలో పట్టపగ్గాలు ఉండకపోవచ్చు. షేర్లు కూడా విశేషంగా లాభిస్తాయి.