- Telugu News Photo Gallery Spiritual photos Navaratri 2024: What color dress is best to wear on Navratri festival? Know the significance of these colors
Dasara 2024: నవరాత్రి పండుగలో ఏ రంగు దుస్తులు ధరించడం మంచిది? రంగులకు అర్ధం ఏమిటంటే
దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే శరన్నవరాత్రి ఉత్సవాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో జగన్మాత తొమ్మిది అవతారాలను పూజిస్తారు. మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రఘంట, నాల్గవ రోజు కూష్మాండా దేవి, ఐదవ రోజు స్కంద మాత, ఆరవ రోజు కాత్యాయిని, ఏడవ రోజు కాళరాత్రి, ఎనిమిదవ రోజు మహాగౌరి, తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి మొదలైనవి. ఈ తొమ్మిది రోజులు నవ దుర్గలను రంగురంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. అదే సమయంలో ఈ నవరాత్రి పండుగలో నవ దుర్గలకు ఇష్టమైన రంగు చీర లేదా దుస్తులను ధరించి అమ్మవారిని పూజించవచ్చు. కనుక నవరాత్రి పండుగలో ఏ రంగు చీరకట్టుకోవాలి.. రంగు ప్రాముఖ్య ఏమిటో తెలుసుకుందాం.
Updated on: Sep 19, 2024 | 11:33 AM

మొదటి రోజు, కుంకుమ రంగు లేదా నారింజ రంగు: నవరాత్రుల మొదటి రోజున కలశ స్థాపన చేసి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభిస్తారు. ఈ రోజున అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తారు. నారింజ రంగు శైలపుత్రికి ఇష్టమైన రంగు. ఈ రోజున మీరు నారింజ రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించవచ్చు. ఈ రంగు ప్రాముఖ్యత ఏమిటంటే నారింజ రంగు శక్తి, ఆనందాన్ని ఇస్తుంది. సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది.

రెండవ రోజు, తెలుపు రంగు: నవరాత్రి ఉత్సవాల్లో రెండవ రోజున అమ్మవారిని బ్రహ్మచారిణినిగా పూజిస్తారు. ఈ రోజు తెల్లటి దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తారు. ఎందుకంటే బ్రహ్మచారిణి దేవికి తెలుపు రంగు చాలా ఇష్టం. ఈ రంగు ప్రాముఖ్యత ఏమిటంటే తెలుపు స్వచ్ఛతకు, శాంతికి చిహ్నం. తెలుపు రంగు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

మూడవ రోజు, ఎరుపు: నవరాత్రి ఉత్సవాల్లో మూడవ రోజున చంద్రఘంట దేవిని పూజిస్తారు. ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిదని చెబుతారు. ఎరుపు జగన్మాతకు ఇష్టమైన రంగుగా పరిగణించబడుతుంది. ఈ రంగు ప్రాముఖ్యత ఏమిటంటే ఎరుపు బలం, ప్రేమకు చిహ్నం.

నాల్గవ రోజు, ముదురు నీలం రంగు: దుర్గాదేవి నవరాత్రుల్లో నాల్గవ రోజున దుర్గాదేవి తొమ్మిది అవతారాలలో ఒకటైన కూష్మాండ దేవిని పూజిస్తారు. కూష్మాండ దేవికి ఇష్టమైన రంగు ముదురు నీలం. ఈ రోజు ముదురు నీలం రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించడం శుభప్రదం. ముదురు నీలం రంగు మంచి ఆరోగ్యం, శ్రేయస్సును సూచిస్తుంది.

ఐదవ రోజు: పసుపు: శరన్నవరాత్రులలో ఐదవ రోజున స్కంద దేవిని పూజిస్తారు. అలాగే ఈ ఐదవ రోజున అమ్మవారిని పసుపురంగు చీరతో అలంకరిస్తారు. పసుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తే శుభం కలుగుతుందని నమ్మకం. ఈ రంగు ప్రాముఖ్యత ఏమిటంటే పసుపు ఆనందం, ఉత్సాహం, సానుకూలతను సూచిస్తుంది. అంతేకాదు పసుపు రంగు అదృష్టానికి సంకేతం.

ఆరవ రోజు, ఆకుపచ్చ రంగు: నవరాత్రులలో ఆరవ రోజున కాత్యాయినీ దేవిని పూజిస్తారు. ఈ రోజున ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం శుభప్రదమని చెబుతారు. ఆకుపచ్చ రంగు ప్రాముఖ్యత ఏమిటంటే ఆకుపచ్చ కొత్త ప్రారంభాలు, సమృద్ధి, శ్రేయస్సుకి చిహ్నం.

ఏడవ రోజు గ్రే కలర్ దుస్తులు: ఈ రోజున అమ్మవారి తొమ్మిది అవతారాలలో ఒకటైన కాళరాత్రిని పూజిస్తారు. అన్ని రకాల ప్రతికూల శక్తి, దుష్టశక్తులను నాశనం చేయడానికి కాళరాత్రిని పూజిస్తారు. ఈ రోజున జగన్మాతను బూడిదరంగు వస్త్రాలు ధరించి పూజించడం శుభప్రదమని చెబుతారు. ఈ రంగు ప్రాముఖ్యత ఏమిటంటే బూడిద రంగు భావోద్వేగాలను సమన్వయం చేస్తుంది.

ఎనిమిదో రోజు ఊదా రంగు: నవరాత్రులలో ఎనిమిదవ రోజున మహాగౌరీని పూజిస్తారు. మహాగౌరీని పూజించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. మహాగౌరికి ఇష్టమైన రంగు ఊదా. ఈ రంగు సంపద, శ్రేయస్సును సూచిస్తుంది.

తొమ్మిదో రోజు నెమలి ఆకుపచ్చ రంగు: నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదవ రోజున సిద్ధిదాత్రి దేవిని పూజిస్తారు. ఈ రోజున నెమలి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించడం శుభప్రదమని చెబుతారు. ఈ రంగు ప్రాముఖ్యతను చూస్తే కరుణకు చిహ్నం.





























