- Telugu News Photo Gallery Spiritual photos Monthly horoscope July 2025: check astrological predictions for all zodiac signs details in telugu
July 2025 Horoscope: అనేక మార్గాల్లో వారి ఆదాయం పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి మాసఫలాలు
మాస ఫలాలు (జూలై 1-31, 2025): మేష రాశి వారికి ఈ నెలలో అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అన్నిటా విజయాలు లభిస్తాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృషభ రాశి వారికి ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. కొన్ని ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మిథున రాశికి చెందిన అన్ని రంగాలవారికి నెల రోజుల పాటు జీవితం అనుకూలంగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి జులై మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Updated on: Jun 30, 2025 | 5:32 PM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, శుక్ర, బుధ, రవి, కుజ గ్రహాల అనుకూలత వల్ల ఈ నెలలో జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ రంగంలో ఉన్నా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఈ నెలలో రవి, కుజ, శుక్ర గ్రహాలు రాశులు మారుతున్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అన్నిటా విజయాలు లభిస్తాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యానికి కూడా ఇబ్బందేమీ ఉండదు. తోబుట్టువులతో స్థిరాస్తి వ్యవహారాలు చక్కబడతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందడం జరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. లలితా సహస్ర నామ స్తోత్రం పఠించడం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు ఇదే రాశిలో ఉండడంతో పాటు లాభ స్థానంలో శని, ధన స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. కొన్ని ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. శుక్ర, రవి గ్రహాలు రాశులు మారడం వల్ల ఆర్థిక పరంగా అదృష్టం పడుతుంది. అయితే, కొన్ని ముఖ్యమైన పనుల్లో ఆలస్యం జరుగుతుంటుంది. స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. కుటుంబంలో కొద్దిగా అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు, ఆటంకాలు ఉండకపోవచ్చు. ఇతరుల విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం మంచిది. తరచూ ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ధన స్థానంలో బుధుడు, తృతీయంలో కుజుడి సంచారం వల్ల ఈ రాశివారికి విదేశీ అవకాశాలు లభిస్తాయి. విదేశీయానానికి ఆటంకాలు, అడ్డంకులు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఊహించని ధన యోగాలు కలుగుతాయి. అన్ని రంగాలవారికి నెల రోజుల పాటు జీవితం అనుకూలంగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. రాదనుకుని వదిలేసుకున్న సొమ్ము కూడా వసూలవుతుంది. వృత్తి, వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగంలో సమర్థవంతంగా బాధ్యతలను, లక్ష్యాలను పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాల నుంచి సైతం విముక్తి లభించే అవకాశం ఉంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. సుందరకాండ పారాయణం వల్ల శుభ యోగాలు కలుగుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): లాభ స్థానంలోకి రాహువు ప్రవేశించడం, దన స్థానంలో కుజుడి సంచారం వల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. అనుకోకుండా కొన్ని శుభ ఫలితాలు, యోగాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగం మారే ప్రయత్నాలు తప్ప కుండా సఫలం అవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. కుటుంబ సమస్యలు, వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని కూడా సంప్రదించడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగినప్పటికీ ఫలితం ఉంటుంది. వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. తండ్రి నుంచి ఆర్థిక లాభం కలుగుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలకు వెళ్లడం జరుగుతుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సుబ్రహ్మణ్యాష్టక పఠనం వల్ల రాహుకేతువుల సమస్యలు తగ్గుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): లాభ స్థానంలో గురువు, దశమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం కానీ, హామీలు ఉండడం కానీ మంచిది కాదు. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు శ్రద్ధను పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి సమస్యలు తలెత్తవచ్చు. తరచూ శివార్చన చేయించడం చాలా మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఈ నెలలో రవి, శుక్ర, కుజ గ్రహాల మార్పు వల్ల ఈ రాశివారు అత్యధికంగా ప్రయోజనం పొందు తారు. దశమ స్థానంలో ఉన్న గురువు వల్ల ఉద్యోగంలో శుభ ఫలితాలను, శుభ యోగాలను అనుభవించే అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు కూడా ఉద్యోగావకాశాలు అందుబాటు లోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని క్రమంగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక ప్రయత్నాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు రాజీమార్గంలో పరిష్కారమవుతాయి. పిల్లలు చదువుల్లో వృద్ధి లోకి వస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల శీఘ్ర పురోగతి ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): భాగ్యస్థానంలో గురువు, లాభస్థానంలో కుజుడు, దశమస్థానంలో రవి, బుధుల సంచారం వల్ల ఈ రాశివారికి ఈ నెలంతా జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితంలో కూడా ఎక్కువగా శుభ పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ వేగం, చురుకుదనం పెరుగుతాయి. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెడతారు. విద్యార్థులకు సునాయాసంగా విజయాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఎక్కువగా ఆదిత్య హృదయం పఠించడం వల్ల లబ్ది పొందుతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): శుక్రుడు, కుజుడు, రవి, బుధులు అనుకూలంగా మారడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. పట్టుదలగా కొన్ని ఆర్థిక, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ జీవితంలో కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. తండ్రి వైపు నుంచి స్థిరాస్తి సంబంధమైన లాభాలు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తాయి. కొందరు బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పిల్లలు చదువుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. తరచూ గణపతి స్తోత్రం పఠించడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఈ నెలంతా గురు, రవి, బుధ, కుజ, రాహువులు అనుకూలంగా ఉండబోతున్నందువల్ల సంతృప్తి కరమైన, సానుకూలమైన జీవితాన్ని అనుభవించే అవకాశం ఉంది. ప్రతి ప్రయత్నమూ లాభ సాటిగా పూర్తవుతుంది. అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ సమర్థత, పనితీరుతో ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు విశేషంగా రాణి స్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఆస్తి వివాదాలు చక్కబడతాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ముందడుగు వేస్తాయి. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాలపరంగా మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. తరచూ విష్ణు సహస్ర నామ స్తోత్ర పఠనం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశ్యధిపతి శని తృతీయంలో, శుక్రుడు పంచమంలో, బుధ రవులు సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల నెల రోజుల జీవితం చాలావరకు సంతృప్తికరంగా, సానుకూలంగానే గడిచిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గు ముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో విపరీతంగా యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మిత్రుల నుంచి కొద్దిగా ఇబ్బందులుంటాయి. తరచూ శివార్చన చేయించడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): చతుర్థ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో గురువు సంచారంవల్ల ఈ రాశివారికి సుఖ సంతో షాలకు లోటుండకపోవచ్చు. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. ఇంటా బయటా శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. కొద్దిగా ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన శుభ ఫలితాలుంటాయి. ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. విద్యార్థులకు శ్రమ మీద ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం లభిస్తుంది. రుద్రాభిషేకం చేయడం వల్ల లబ్ది పొందుతారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): శుక్ర, గురు, బుధ, రవులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. కొన్ని ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి కూడా గట్టెక్కుతారు. ప్రభుత్వపరంగా గుర్తింపు లభించే అవకాశం ఉంది. గతంలో సహాయ సహకారాలు పొందిన స్నేహితులు కొందరు ముఖం చాటేసే అవకాశం ఉంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తి కరంగా సాగిపోతాయి. కొత్త లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. తరచూ నరసింహస్వామికి అర్చన చేయడం బాగా మేలు చేస్తుంది.



