
వృషభం: ఈ రాశికి షష్ట స్థానంలో బుధ సంచారం వల్ల ఈ రాశివారు ఉద్యోగంలో కొన్ని పొరపాట్లు చేసి అధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా కొద్దిగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో కొందరు బంధువులు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మీ తెలివితేటలకన్నా మీ శత్రువుల తెలివితేటలు బాగా రాణిస్తాయి. ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం చాలా మంచిది.

కర్కాటకం: ఈ రాశికి తృతీయ, వ్యయాదిపతిగా అత్యంత పాపి అయిన బుధుడు చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి ఆస్తి వివాదాల్లో కొద్దిగా అన్యాయం జరిగే అవకాశం ఉంది. బాగా సన్నిహితులు తప్పుదోవ పట్టించడం జరుగుతుంది. ఆస్తి, ఆర్థిక, గృహ సంబంధమైన ఒప్పం దాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గుడ్డిగా సంతకాలు చేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు.

సింహం: ఈ రాశికి తృతీయ స్థానంలో బుధ సంచారం వల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉండే అవకాశం ఉంది. బంధుమిత్రుల వల్ల ధన నష్టం జరుగుతుంది. గతంలో ఆర్థికంగా సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ప్రయాణాలు లాభించవు. కొత్త ప్రయత్నాలు చేపట్టకపోవడం ఉత్తమం.

వృశ్చికం: ఈ రాశికి వ్యయ స్థానంలో బుధ సంచారం వల్ల ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా ఒక పట్టాన కలిసి రాకపోవచ్చు. కొందరు సన్నిహితులు, బంధుమిత్రుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. ఎవరితోనూ వ్యక్తిగత విషయాలు, రహస్యాలు పంచుకోకపోవడం మంచిది. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు బాగా ఇబ్బంది కలిగిస్తాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆర్థిక లావాదేవీల్లో, వ్యవహారాలు కొన్ని పొరపాట్లు జరుగుతాయి.

మీనం: ఈ రాశికి అష్టమ స్థానంలో బుధ సంచారం వల్ల అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్టుగా ఉంటుంది. ఏ ప్రయత్నమూ కలిసి రాదు. రావలసిన డబ్బు చేతికి అందదు. బంధుమిత్రుల మీద అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం కాకపోవచ్చు. ధన పరంగా ఎవరికీ మాట ఇవ్వవద్దు. ఏ ప్రయత్నమూ ఒక పట్టాన ముందుకు సాగదు. రావలసిన సొమ్ము సకాలంలో, సవ్యంగా చేతికి అందకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు పెరుగుతాయి.