
మేషం: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారికి కుజ దోషం కలిగింది. దీనివల్ల జీవిత భాగస్వామి అనారోగ్యాలతో ఇబ్బంది పడడం, దంపతుల మధ్య విభేదాలు తలెత్తడం వంటివి జరుగుతాయి. కుటుంబ జీవితంలో గానీ, దాంపత్య జీవితంలో గానీ టెన్షన్లు, మానసిక ఒత్తిళ్లు తలెత్తే సూచనలున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల జోక్యాన్ని తగ్గించడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తవచ్చు.

కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజుడి సంచారం వల్ల మాంగల్య దోషం ఏర్పడింది. వాహనాలు నడప డంలో, ప్రయాణాలు చేయడంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ జీవితంలో మన స్పర్థలు తలెత్తే అవకాశం ఉంది. దంపతుల్లో ఒకరు దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. ఆస్తిపాస్తుల సమస్యలు దంపతుల మధ్య బాగా అపార్థాలు సృష్టించడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి తలెత్తుతుంది.

కన్య: ఈ రాశికి కుటుంబ స్థానంలో కుజుడి సంచారం వల్ల దంపతుల మధ్య తరచూ వాదోపవాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సమస్యల కారణంగా అభిప్రాయభేదాలు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. దంపతుల్లో ఒకరిని అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తప్పకపోవచ్చు.

తుల: ఈ రాశిలో కుజ సంచారం వల్ల కోపతాపాలు, అసహనాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంతానికి బదిలీ కావడం గానీ, అనారోగ్యాలతో ఇబ్బంది పడడం గానీ జరుగుతుంది. ఈగో సమస్యలతో చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంది. పిల్లల నుంచి కొన్ని సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. కొద్ది రోజుల పాటు ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం కాకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి తలెత్తే అవకాశం ఉంది.

వృశ్చికం: కుజుడు ఈ రాశికి అధిపతే అయినప్పటికీ, వ్యయ స్థానంలో సంచారం వల్ల కుజ దోషం కలిగింది. దంపతుల్లో ఒకరికి దూర ప్రాంతంలో లేదా విదేశాల్లో ఉద్యోగం లభించడం వల్ల ఎడబాటు కలిగే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం కూడా ఉంది. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి రావడం వల్ల, ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సవ్యంగా సాగవు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం లోపిస్తుంది.

మీనం: ఈ రాశికి అష్టమ స్థానంలో కుజ సంచారం వల్ల మాంగల్య దోషం ఏర్పడింది. దీనివల్ల జీవిత భాగ స్వామికి వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రయాణాలను వాయిదా వేయడం, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం, ప్రయాణాలను రద్దు చేసుకోవడం మంచిది. విద్యుదా ఘాతాలకు కూడా అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో బాగా అప్రమత్తంగా ఉండడం అవసరం. పెళ్లి ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది.