- Telugu News Photo Gallery Spiritual photos Know about Ainavilli Sidhi Vinayaka Temple, Ancient Ganapathi Shrine history and rituals
Konaseema: కోనసీమ వాసుల కొంగు బంగారం.. కొబ్బరి కాయ కొడితే కోర్కెలు తీర్చే గణేశుడు..
అందమైన కోనసీమ జిల్లా అడుగడుగునా ఆధ్యాత్మిక ఉట్టిపడుతుంది. గోదావరి నది వివిధ పేర్లతో ప్రవహించే ఈ నెలలో అనేక పురాతన మహిమాన్విత పుణ్యక్షేత్రాలున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం. గోదావరి తీరాన ప్రకృతి రమణీయత మధ్య ఉన్న ప్రాచీన దేవాలయంలో వినాయకుడు స్వయంభువుగా వెలశాడు. దక్షిణాభిముఖంగా భక్తులకు దర్శినం ఇస్తూ కోరిన కోర్కెలు స్వామిగా పూజలను అందుకుంటున్నాడు. నారికేళ గణపతిగా పిలబడుతున్నాడు.
Updated on: Jun 04, 2025 | 5:17 PM

కోనసీమ జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రం అయినవిల్లి. ఇక్కడ స్వయంభువుగా వెలసిన సిద్ధివినాయకుని భక్తిశ్రద్ధలతో పూజించి కొబ్బరి కాయని సమర్పిస్తే కోరిన కోర్కెలు తీరడంతో పాటు బుద్ధి వికసిస్తుందని భక్తుల నమ్మకం. అందుకనే విఘ్నాలను తొలగించే వినాయకుడిని ఇక్కడ నారికేళ వినాయకుడు అని కూడా పిలుస్తారు. దర్భలతో ప్రధానంగా పూజలను అందుకే ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైనది. వినాయకుడి ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడైన కాలభైరవుని ఆలయంతో పాటు హరిహరసుతురు అయప్ప ఆలయం, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకేశవుడు, అన్నపూర్ణాదేవి, శివుని ఆలయాలున్నాయి.

కాణిపాకం క్షేత్రం కంటే పురాతనమైన సిద్దివినాయకుడి ఆలయంలో రోజూ శైవాగమ శాస్త్ర ప్రకారం కొబ్బరికాయలు, పండ్లరసాలతో అభిషేకాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ప్రతీనెలా కృష్ణపక్ష, శుక్లపక్ష చవితి తిధులు, దశమి, ఏకాదశులలో, వినాయకచవితి పర్వదినాలలో ఇక్కడ ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఇక మార్చి నెలలో స్వామివారికి లక్ష పెన్నులతో అర్చన ఎంతో ప్రసిద్దిగాంచింది. స్వామిని దర్శించుకుని కోరిన కోర్కెలు నెవేరిన వెంటనే తమ మొక్కుబడిని తీర్చుకోవడానికి తప్పకుండా మళ్ళీ స్వామి దర్శనానికి వెళ్ళాలని భక్తుల నమ్మకం.

విద్యార్ధుల చదువులో విఘ్నాలను తొలగించే సిద్ది వినాయకుడికి ప్రతి సంవత్సరం మార్చి నెలలో లక్ష పెన్నులతో పూజలు కూడా నిర్వహిస్తారు. మొదటిగా సప్తనది జలాల అభిషేకం చేసి తరువాత లక్ష పెన్నులతో పూజా నిర్వహిస్తారు. అనంతరం ఈ పెన్నులను చదువుకునే విద్యార్థులకు పంపిణీ చేస్తారు. ఈ పెన్నులు తీసుకునేందుకు స్టూడెంట్స్ ఎక్కెడెక్కడి నుంచో ఈ ఆలయానికి ఈ సమయంలో వస్తారు. స్వామీ ప్రసాదంగా పెన్నుని తీసుకుంటారు. ఈ పెన్ను తమ దగ్గర ఉంటె అపజయం ఉందని స్టూడెంట్స్ నమ్మకం.

ఈ ఆలయం చరిత్ర, పురాణ కథతో ముడిపడి ఉంది. ఇక్కడ స్వామివారి స్వయంభువుగా వేలిసిన మొదటి క్షేత్రం అని విశ్వాసం. పురాణ ఇతిహాసం ప్రకారం రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ వినాకుడికి పూజలు జరిపాడని విశ్వసించబడుతుంది. ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తారు. వ్యాస మహర్షి దక్షిణ యాత్ర ప్రారంభానికి ముందు గణపతికి పూజలు చేసేందుకు కోరగా వినాయకుడు స్వయంగా ఇక్కడ విగ్రహ రూపంలో వెలిశాడని.. అప్పుడు ఆ విగ్రహాన్ని వ్యాస మహర్షి ప్రతిష్టించాడని.. దేవతలు ఆలయాన్ని నిర్మించారు అని చెబుతారు. కాలక్రమంలో ఈ ఆలయన్ని ఈ ప్రాంతాన్ని పాలించే తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్ధానాధీశుల వరకు ఎందరో ఆలయ పునరుద్ధరణ చేశారు.

రెండవ కథ ప్రకారం ఇక్కడ స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరుగుతున్న సమయంలో వినాయకుడు ప్రత్యక్షమై అక్కడి వారిని అనుగ్రహించాడని అంటారు. ఈ విషయాన్నీ 14 వ శతాబ్దంలో శంకరభట్టు వ్రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో పేర్కొన్నారు. ఇలా ప్రత్యక్షం అయినప్పుడు వినాయకుడిని చూసిన ముగ్గురు వ్యక్తులు హేళన చేయగా.. ఆ ముగ్గురు మూర్ఖులను వినాయకుడు శపించాడనీ తరువత కాలంలో వారే మూగ, చెవిటి, గుడ్డివారిగా జన్మించి కాణిపాకం వినాయకుడి ఆవిర్భావాన్ని గుర్తించారని స్థలపురాణం వివరిస్తుంది.

ఈ క్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రం కన్నా పురాతనమైనదని చరిత్రకారుల కథనం. సాధారణంగా ప్రతీ దేవాలయాలు వినాయకుడు విగ్రహం తూర్పుముఖంగా ఉంటుంది. అయితే ఇక్కడ శ్రీ విఘ్నేశ్వరస్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు. అందుకనే ఈ గ్రామంలో దక్షిణ సింహాద్వారంతో నిర్మించిన ఇళ్ళకు ఎటువంటి విఘ్నాలు కలుగవని, ఆ ఇంట్లో నివసించే వారికి సిరిసంపదలకు లోటు ఉండదని గ్రామస్తుల నమ్మకం.

కోనసీమ వాసులు మాత్రమే కాదు దేశం నలుమూలల నుంచి రోజూ వేలాది మంది భక్తులు, ప్రముఖులు వినాయకుడిని దర్శించుకుంటారు. స్వామివారికి కొబ్బరికాయలు సమర్పిస్తారు. ప్రశాంత వాతావరణంలో గోదావరి నదీ తీరం ప్రాంతలో ఉన్న ఈ నారికేళ గణపతిని కోనసీమ వెళ్ళినప్పుడు తప్పని సరిగా దర్శించుకోండి. స్వామి కృపకు పాత్రులు కండి.
