
జీవితంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తారు.. అయితే అందరూ ఆశించిన ఫలితాలను సాధించలేరు. కొంత మంది ఎంత కష్టపడి పనిచేసినా.. ఫలితం అసంపూర్ణంగా మిగులుతుంది. ఈ విషయంపై ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో ఈ రహస్యాన్ని లోతుగా విశ్లేషించాడు. కష్టపడి పనిచేయడమే కాదు.. సరైన దిశ, సరైన ఆలోచన, సరైన సమయంలో సరైన అడుగులు వేయడం కూడా విజయంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన నమ్మాడు. ఈ మూడు సమతుల్యంగా లేకపోతే.. ఒక వ్యక్తి ఎంత ప్రయత్నం చేసినా,.. పూర్తి ప్రతిఫలాన్ని పొందలేరని చెప్పాడు.

దిశానిర్దేశం ప్రాముఖ్యత: చాణక్యుడు చెప్పిన ప్రకారం కష్టపడి పనిచేడానికి ముందు.. చేసే పని గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాలి.. సరైన దిశలో మొదలు పెట్టాలి. అంతేకాని తప్పు దిశలో కష్టపడి పనిచేస్తే.. ఫలితాలు ఎప్పటికీ సానుకూలంగా ఉండవు. అంటే ఒక మంచి విత్తనాన్ని తీసుకుని దానిని బంజరు భూమిలో నాటితే.. మొక్క మొలవదు.. పంట పెరగదు. అదే విధంగా చేసే పని మీద అవగాహన లేకపొతే ఆ పనిని ఎంత సేపు చేసినా ఫలితం దక్కదు.

జ్ఞానం, తెలివి తేటలు: శారీరక శ్రమ మాత్రమే కాదు.. తెలివితేటలు కూడా చాలా అవసరం. జ్ఞానం లేకుండా కష్టపడి పనిచేయడం అసంపూర్ణమని చాణక్యుడు చెప్పాడు. తెలివితేటలు, విచక్షణని కలిపి చేసే చిన్న ప్రయత్నాలు కూడా గణనీయమైన ఫలితాలను ఇస్తాయి.

సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం: సరైన సమయాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. సరైన సమయంలో పని చేయకపోతే.. శ్రమ వృధా అవుతుంది. చాణక్య నీతి ప్రకారం "ఎవరూ తమ సమయానికి ముందు లేదా తమ అదృష్టానికి మించి ఏమీ పొందలేరు." కనుక సరైన పనిని కష్టపడి పనిచేసి పూర్తి చేసినప్పుడే ఫలితం లభిస్తుంది.

సహనం, నిగ్రహం: ప్రజలు తరచుగా తక్షణ ఫలితాలను కోరుకుంటారు. అయితే కష్టపడి పనిచేస్తే ఫలితం రావడానికి సమయం పడుతుంది. ఓర్పు, పట్టుదల ఉన్నవారే చివరికి విజయం సాధిస్తారు. తొందరపాటు చర్యలు తరచుగా వైఫల్యానికి దారితీస్తాయని చాణక్యుడు నమ్మాడు.

చెడు స్నేహం ప్రభావం: చెడు సహవాసం కష్టార్జితాన్ని కూడా దారి తప్పేలా చేస్తుంది. ఎవరి చుట్టూ అయినా చెడు స్నేహితులు ఉంటే.. అప్పుడు వారు చేసే ప్రయత్నాలు సరైన దిశలో సాగవు. అందుకే, చాణక్యుడు ఎల్లప్పుడూ మంచి సహవాసం ఎంత ముఖ్యమో చెప్పాడు.