- Telugu News Photo Gallery Spiritual photos Astro Tips in Telugu: These 6 zodiac signs are best parents according astrology. check details
Best Parents: పిల్లల పెంపకంలో ఈ రాశుల వారు బెస్ట్.. క్రమశిక్షణ విషయంలో వారు కఠినంగా కూడా వ్యవహరిస్తారు..!
పిల్లల పెంపకంలో ఏ రాశివారు సమర్థవంతంగా వ్యవహరిస్తారన్నది జాతక చక్రంలో వివిధ గ్రహాల స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. అయితే, స్థూలంగా కొన్ని రాశులవారు సహజసిద్ధంగా, స్వభావసిద్ధంగా పిల్లలను పెంచడం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.
Updated on: Jul 13, 2023 | 5:35 PM

పిల్లల పెంపకంలో ఏ రాశివారు సమర్థవంతంగా వ్యవహరిస్తారన్నది జాతక చక్రంలో వివిధ గ్రహాల స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. అయితే, స్థూలంగా కొన్ని రాశులవారు సహజసిద్ధంగా, స్వభావసిద్ధంగా పిల్లలను పెంచడం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. మిగిలిన రాశుల వారిని గ్రహాల స్థితిని బట్టి అంచనా వేయాల్సి ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం, వృషభ, కర్కాటక, కన్య, తుల, మకర, మీన రాశులవారు పిల్లల పెంపకం విషయంలో ఎక్కువగా బాధ్యతలను ఫీలవుతారు. గ్రహాలకు సంబంధించినంత వరకూ గురు, బుధ, శని గ్రహాలు పిల్లల పెంపకం విషయంలో బాగా శ్రద్ధ తీసుకుంటాయి.

వృషభం: ఈ రాశి వారికి కుటుంబం మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. పిల్లల విషయానికి వచ్చే సరికి వారు పుట్టక ముందు నుంచీ వారి పెంపకం విషయంలో ప్రణాళికలు సిద్ధం చేస్తారు. సంపాదన, ఖర్చులు వగైరాలను క్రమబద్ధం చేస్తారు. పిల్లలను పెంచే విషయంలో వీరికి విపరీతమైన తాప త్రయం ఉంటుంది. ఈ రాశివారు పురుషులైనప్పటికీ, పిల్లల విషయంలో తమకు తాముగా బాధ్యతలను తీసుకుంటారు. ఒక నర్సులాగా పిల్లలకు సేవ చేస్తారు. పిల్లలను వదిలిపెట్టి ఉండడానికి కూడా ఇష్టపడరు. వీరిలో జీవితాంతం పిల్లల పట్ల ప్రేమ వ్యక్తమవుతూనే ఉంటుంది.

కర్కాటకం: పిల్లల పెంపకానికి సంబంధించినంత వరకూ వీరు ఒక పద్ధతి ప్రకారం వ్యవహరిస్తారు. ఈ రాశివారు సహజసిద్ధమైన తల్లులు. కొంచెం పొసెసివ్ గా కూడా ఉంటారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు శిక్షణనివ్వడం, క్రమశిక్షణ నేర్పడం, తీర్చిదిద్దడం వంటివి ఉంటాయి. చదువు చెప్పడంలో కూడా పద్ధతి ప్రకారం ఉంటారు. ఒకపక్క ప్రేమగా ఉంటూనే, క్రమశిక్షణ విషయంలో కఠినంగా కూడా వ్యవహరిస్తారు. సాధారణంగా వీరి పెంపకంలో లోపం ఉండదు. వీరి పిల్లలు పైకి రావడానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల పెంపకంలో శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరిస్తారు.

కన్య: ఈ రాశివారికి అంతా ప్లాన్ ప్రకారం చేస్తుంటారు. పిల్లల పెంపకంలో కూడా ప్లాన్ ప్రకారం నడుచు కుంటారు. పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇస్తారు. పిల్లలకు తగినంత స్వేచ్ఛనిస్తూనే, వారంతట వారు తెలుసుకునేలా చేస్తుంటారు. ఎప్పుడు చూసినా పిల్లలకు ఏదో ఒక మంచి మాట చెప్పడం, ఏదో ఒకటి బోధించడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశివారు జీవితాంతం పిల్లలను అంటి పెట్టుకునే ఉంటారు. పిల్లలకు కొండంత అండగా ఉంటారు. జీవితాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన మనోధైర్యాన్ని నూరిపోస్తుంటారు. వీరి పద్ధతంగా ఒక టీచర్ స్థాయిలో సాగుతుంటుంది.

తుల: ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేయకుండా, భావోద్వేగాలకు అవకాశం లేకుండా పిల్లలను పెంచడంలో తులా రాశివారు సిద్ధహస్తులు. పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా పెరగడానికి వీలైన వాతావరణాన్ని వీరు ఇంట్లో సృష్టిస్తారు. పిల్లలకు కావాల్సినవి సమకూర్చి పెడుతూనే, వారి విద్యాబుద్ధుల విషయంలో శ్రద్ధ తీసుకుంటుంటారు. ఈ రాశివారిలో ప్రేమ, క్రమశిక్షణ సమపాళ్లలో ఉంటాయి. సాధారణంగా తులా రాశి తల్లితండ్రుల పట్ల పిల్లల్లో భయ భక్తులు కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఆడపిల్లలయినా, మగపిల్లలైనా సమానంగా చూస్తారు.

మకరం: ఏ విధంగా చూసినా ఈ రాశివారు అసాధారణ తల్లితండ్రులుగా గుర్తింపు పొందుతారు. ఆడుతూ పాడుతూనే పిల్లలకు క్రమశిక్షణ నేర్పిస్తూ ఉంటారు. పిల్లలను చదువుల్లోనే కాక, ఆట పాటల్లో కూడా నిష్ణాతులను చేయాలని తపించిపోతుంటారు. పిల్లలలోని నైపుణ్యాలను గుర్తించడంలో వీరికి వీరే సాటి. పిల్లలు పెద్దవాళ్లు అయిన తర్వాత కూడా పిల్లలుగానే చూడడం వీరి ప్రత్యేకత. పిల్లల అభివృద్ధి కోసం ఎంత కష్టానికైనా ఓర్చుకుంటారు. కొండల్నికదల్చడానికైనా సిద్ధపడతారు. పిల్లలకు ఎటువంటి కష్టమూ రానివ్వకుండా పెంచడంతో పాటు వీరికి చక్కని భద్రత కూడా కల్పిస్తారు.

మీనం: పిల్లలను అర్థంచేసుకుని పెంచడానికి ప్రాధాన్యం ఇస్తారు. పిల్లల మనసులోని భావాలను అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా వారిని పెంచుతారు. ఒక్కోసారి వీరి శ్రద్ధాసక్తులు మోతాదును మించి ఉంటాయి. పిల్లలు అడిగినా అడగకపోయినా సౌకర్యాలను కల్పించడంలో, వారి మనసులోని కోరికలను తీర్చడంలో వీరు సిద్ధహస్తులు. పిల్లల్లో క్రమశిక్షణ అవసరమని వీరు గట్టిగా నమ్ముతారు. ఇంట్లో తాము స్వయంగా వారికి చదువు చెప్పడంతో పాటు, వారికి లౌకిక లేదా ప్రాపంచిక విజ్ఞానం కోసం ఎక్కువగా బయట తిప్పుతుంటారు.



