ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు నట్స్, డ్రైఫ్రూట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని నేరుగా తినడం కన్నా నానబెట్టి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. అయితే వీటిని పాలల్లో నానబెట్టాలో లేదంటే నీళ్లలో నానబెట్టాలో చాలా మందికి తెలియదు. వాల్‌నట్‌లు, బాదం, ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్‌ను అలాగే తినడం కంటే నానబెట్టి తినడం మంచిది. ఇది డ్రై ఫ్రూట్స్ గింజలను మృదువుగా చేస్తుంది. దీనిపై తొక్కలను కూడా సులభంగా తొలగించవచ్చు.
నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. దంత సమస్యలున్న వారికి సులభంగా నమలడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌లో పోషక విలువలు కూడా పెరుగుతాయి. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన స్థితిలో తినడం వల్ల శరీరంలోని పోషకాలను గ్రహించడంలో కూడా సహాయపడుతుంది. అందుకే చాలా మంది బాదం, ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి తింటారు. బరువు తగ్గే వారు నీళ్లలో నానబెట్టిన గింజలు, డ్రై ఫ్రూట్స్ తింటే సులువుగా బరువు తగ్గుతారు. ఇది శరీరంలో ఎక్కువ కేలరీలు చేరనీయదు.
పాలలో కాల్షియం, ఐరన్, విటమిన్ డి వంటి వివిధ పోషకాలు ఉంటాయి. పాలలో డ్రై ఫ్రూట్స్ నానబెట్టడం వల్ల రెండు ఆహారాలలోని పోషకాలు మిళితం అవుతాయి. అంటే, పాలలో నానబెట్టిన బాదంలో పోషక విలువలు పెరుగుతాయి.
గింజలు, డ్రై ఫ్రూట్స్ ను పాలలో నానబెట్టి తింటే మంచిదేగానీ.. బాదం, వాల్‌నట్స్ వంటి గింజలను పాలతో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. లేదా ఏదైనా స్మూతీలో పాలు, డ్రై ఫ్రూట్స్ రెండింటినీ కలపవచ్చు. ఇది రుచిగా కూడా ఉంటుంది.
లాక్టోస్ అలర్జీ ఉన్నవారు పాలలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినకూడదు. ఇది కడుపు సమస్యలను పెంచుతుంది. డ్రై ఫ్రూట్స్ కూడా ఎలాంటి మేలు చేయవు. ఇలాంటి వారు నీటిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది.