
నేటి కాలంలో చర్మం పట్ల అధిక శ్రద్ధ అవసరం. ఓ వైపు కాలుష్యం.. మరోవైపు ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ నుంచి వచ్చే హానికర కిరణాలు చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే ఎండలోకి వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం నుంచి ప్రతి రాత్రి పడుకునే ముందు స్క్రబ్ వరకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతుంటారు.

ముఖ్యంగా మొబైల్ ఎక్కువగా వాడేవారిలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. దాదాపు రోజంతా మొబైల్ ఫోన్ వాడేవారి కళ్ళు మాత్రమే కాదు, చర్మం కూడా చాలా తీవ్రంగా దెబ్బతింటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మొబైల్ మాత్రమే కాదు, కంప్యూటర్, ల్యాప్‌టాప్ వంటి డిజిటల్ పరికరాల నుంచి వెలువడే కిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. దీని వెనుక వీటి నుంచి వెలువడే 'బ్లూ లైట్' పాత్ర కీలకం.

ఈ కాంతి చర్మలోని ప్రోటీన్లు, కొల్లాజెన్, ఫైబర్‌లను నాశనం చేస్తుంది. చర్మంలో 'మెలనిన్' ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా రకరకాల చర్మ సమస్యలు తలెత్తుతాయి. మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను నాలుగు గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు నిరంతరం వాడితే 'మెలనిన్' స్రావాల పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా చిన్న వయసులోనే చర్మం డల్ గా మారుతుంది.

ముఖంపై నల్ల మచ్చలు కనిపించవచ్చు. కళ్ల కింద నల్లటి వలయాలు, ముడతల సంకేతాలు కూడా కనిపిస్తాయి. ఫలితంగా చర్మం చిన్న వయస్సులోనే వృద్ధాప్యం, వయస్సు సంబంధిత గుర్తులు కనిపిస్తాయి. చిన్న వయసులో చర్మ వృద్ధాప్య సమస్య రాకుండా ఉండాలంటే 'స్క్రీన్ టైమ్' లేదా మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల వాడకాన్ని తగ్గించాలి. కానీ సమస్య ఏమిటంటే వృత్తిపరమైన కారణాల వల్ల దాదాపు సగం రోజు ల్యాప్‌టాప్ ముందు గడపవలసి ఉంటుంది.

ఈ సమస్యను వదిలించుకోవడానికి విటమిన్ సి, విటమిన్ ఇ కలిగిన లోషన్ లేదా సీరం ఉపయోగించవచ్చు. ఇది లోపలి నుంచి చర్మానికి పోషణ ఇస్తుంది.