రాయల సీమ జిల్లాల్లో చినుకు పడితే ఎగిరి గంతులేసే పరిస్థితి. ఇప్పటికే వర్షాలు లేక తీవ్ర దుర్భిక్షం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఎందరికో సంతోషం, సంతృప్తి.. కానీ ఆ కొందరికి మాత్రం తీరని నష్టం జరిగింది. ఆరుగాలం పండించిన పంట తీవ్రంగా డ్యామేజ్ అయ్యింది. గాలివానకి వరి పంట దెబ్బతిందని రైతులు వాపోతున్నారు.
నంద్యాల జిల్లాలో గాలివాన బీభత్సంకు చేతికి అందివచ్చిన పంట నేలకొరగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వారం రోజుల్లో ధ్యానం అమ్ముకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్న రైతులకు కన్నీరే మిగిలింది.
ఇలా గాలికి నెలకొరిగి, ధ్యానం పొలంలో తడిసి పోవడంతో రైతులు అందోళన చెందుతున్నారు. బండి అత్మకూరు మండలంలో బుధవారం తెల్లవారుజామున గాలి, వాన బీభత్సం సృష్టించింది. మండలంలో ఆకాలంగా వీచిన గాలులు, వానతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
మండలంలోని సింగవరం, బండి అత్మకూరు, పార్నపల్లె, రామాపురం గ్రామాల్లో వందల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. వారం రోజుల్లో చేతికొచ్చిన పంట నేలకొరగడంతో రైతులు అవేధన వ్యక్తం చేస్తున్నారు.
ఎకరాకు రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెట్టి పంట సాగు చేశామని కన్నీరు మున్నీరుగా రైతులు విలపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించి అదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.